బాన్సువాడ/కోటగిరి, సెప్టెంబర్ 26: స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా అభివృద్ధిని పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్ లేకుంటే.. భవిష్యత్‌లో తెలంగాణ చీకటిమయం అవుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంచి పనులు చేసే నాయకులపై తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని స్పష్టంచేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో రూ.1.51 కోట్లతో చేపట్టిన వివి ధ అభివృద్ధి పనులను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి స్పీకర్ ప్రారంభించారు. బాన్సువాడలో చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. బీర్కూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. మంచి చేసే నాయకులను ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారని చెప్పారు.
దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ పాటుపడుతున్నదని ఉద్ఘాటించారు. మైకులు పట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు.. ఆ పార్టీలు పాలించే రాష్ట్రాల్లో ఎందుకు లేవో సమాధానం చెప్పి ప్రజలను ఓట్లు అడుగాలని హితవు పలికారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ పూటకోమాట మాట్లాడుతున్నారని, అలాంటి వారు రాష్ర్టానికి ఏ విధంగా న్యాయం చేస్తారో ప్రజలే ఆలోచన చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే బీసీ చేయూత కింద 14 కులాలకు రూ.లక్ష చొప్పున అందజేస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.