హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుచేసుకొనే మహిళా సంఘాలు, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారునున్నదా? ఆయా వర్గాలు ఉత్పత్తి చేసే విద్యుత్తును మూడో డిస్కంకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇలాంటి ఆందోళన వ్యక్తమవుతున్నది. మూడో డిస్కం పుట్టుకే అప్పులతో ప్రారంభమవుతుండటమే ఇందుకు కారణం. రైతులు, మహిళా సంఘాలు ఉత్పత్తిచేసిన విద్యుత్తును కొత్తగా ఏర్పాటుచేసే మూడో డిస్కం వాడుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు జీవో జారీచేసింది. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అన్నీ కొత్త డిస్కంకే బదలాయిస్తామని పేర్కొన్నది. ఏప్రిల్ 1 నుంచి మూడో డిస్కం కార్యకలాపాలు సాగించనున్నది. ఈ డిస్కం రూ.71 వేల కోట్ల అప్పులతో పుడుతున్నది. ఇలాంటి డిస్కం సోలార్ పవర్ జనరేటర్లు అయిన రైతులు, మహిళా సంఘాలకు వారు ఉత్పత్తి చేసే విద్యుత్తు వాడుకున్నందుకు వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించగలుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదాయం శూన్యం
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే మూడో డిస్కం కేవలం ఉచిత పథకాలకే పరిమితం. పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు ఈ డిస్కం పరిధిలో ఉండవు. ఇప్పటికే ప్రభుత్వ శాఖలు డిస్కంలకు భారీ మొత్తంలో బకాయిలు పడ్డాయి. ఇప్పుడున్న బకాయిల్లో రూ.35,982 కోట్లు మూడో డిస్కంకు కేటాయించారు. ఇక రూ.9,032 కోట్ల రుణాలు సైతం మూడో డిస్కంకే బదలాయించారు. టీజీ జెన్కో, సింగరేణి సహా ఇతర జనరేటర్లకు విద్యుత్తు చార్జీల కింద చెల్లించాల్సిన మొత్తం రూ.26,950 కోట్లు కూడా మూడో డిస్కం ఖాతాలోనే పడ్డాయి. అంటే మొత్తంగా మూడో డిస్కం అప్పులు, బకాయిలు అన్ని కలిపితే రూ.71,964 కోట్లు. కానీ ఈ డిస్కం ఆస్తులు రూ.4,929 కోట్లు మాత్రమే. వ్యవసాయం సహా ఇతర పథకాలకు విద్యుత్తు రాయితీ కింద సర్కార్.. ఏటా రూ.13,499 కోట్లు కేటాయిస్తున్నది. దీంట్లో అగ్రికల్చర్‌కు ఇచ్చేది రూ.11,602 కోట్లు. గృహజ్యోతి, విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు కింద ఇస్తున్నది రూ.1,896 కోట్లు.
అసలేం జరిగిందంటే..
పీఎం కుసుమ్ పథకం కింద రైతులతో, ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక మహిళా సంఘాలతో ప్రభుత్వం సోలార్ ప్లాంట్లు పెట్టిస్తున్నది. పీఎం కుసుమ్ కాంపోనెంట్-ఏ కింద 1,200 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇందిరా మహిళాశక్తి పథకం కింద వెయ్యి మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. వాస్తవానికి నాలుగువేల మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటుచేయాలని సర్కార్ లక్ష్యం. మొదటి విడతలో వెయ్యి మెగావాట్లకు అనుమతినిచ్చారు. వీటి నుంచి ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్తును డిస్కంలే కొనుగోలు చేస్తాయని పేర్కొన్నారు. ఉత్తర డిస్కంలు, దక్షిణ డిస్కంలు ఆయా రైతులతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం సోలార్ విద్యుత్తు సరఫరాకు రైతులు, మహిళా సంఘాలకు డిస్కంలు యూనిట్‌కు రూ.3.13 చొప్పున ఇవ్వాలి.
కోట్లు పెట్టి స్థాపించిన తర్వాత..
రైతులు, మహిళా సంఘాలు కోట్లు వెచ్చించి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. అది కూడా బ్యాంక్‌ల నుంచి అప్పులు తెచ్చి, అధిక వడ్డీల భారాన్ని మోస్తూ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఒక మెగావాట్ ప్లాంట్‌కు రూ.4 కోట్లు, రెండు మెగావాట్ల ప్లాంట్‌కు రూ.7.5 కోట్లు ఖర్చుచేస్తున్నారు. 8.6% నుంచి 9% వడ్డీలకు అప్పులు తెచ్చి ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. రెండు మెగావాట్ల ప్లాంట్ నుంచి ఏడాదికి గరిష్ఠంగా రూ.18.3 లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంచనా. యూనిట్‌కు రూ.3.13 చొప్పున డిస్కంలు చెల్లిస్తే ఏడాదికి రైతులకు రూ.55 లక్షలకుపైగా ఆదాయం వస్తుంది. ఎండ తీవ్రత తక్కువగా ఉంటే, వర్షాలు కురిస్తే ఉత్పత్తి పడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఆ మేరకు ఆదాయం తగ్గుతుంది. అయితే 45 రోజుల్లోపు రైతులకు డిస్కంలు జనరేషన్ చార్జీలు చెల్లించాలి. ఇలా కోట్ల రూపాయలు వెచ్చించి ప్లాంట్ ఏర్పాటుచేసిన తర్వాత అప్పుల డిస్కం వీటిని చెల్లించే స్థితిలో ఉంటుందా? 45 రోజుల్లో చెల్లిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మూడో డిస్కం అప్పులు, ఆస్తులు
డిస్కంల నుంచి బదలాయించిన బకాయిలు : రూ.35,982 కోట్లు
బదలాయించిన రుణాలు : రూ.9,032 కోట్లు
టీజీ జెన్కో, సింగరేణి తదితర జనరేటర్లకు చెల్లింపులు : రూ.26,950 కోట్లు
మొత్తం బకాయిలు, రుణాలు, చెల్లింపులు : రూ.71,964 కోట్లు
ఆస్తులు : రూ.4,929 కోట్లు