Gurukula School | సిర్పూర్(టీ): సిర్పూర్(టీ) సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. 34 మంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతుండగా ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను సిర్పూర్(టీ) సామాజిక దవాఖానకు తరలించారు. సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వో మెరుగైన వైద్యమందేలా చూశారు. సోమవారం మరో 8 మందికి జ్వరం రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. చికిత్స తీసుకున్న 26 మంది విద్యార్థుల్లో.. 16 మందిని తల్లిదండ్రులకు అప్పగించారు. 100 మందికిపైగా విద్యార్థులకు జ్వారాలు వచ్చినట్టు తెలుస్తున్నది. డీఎల్పీవో, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సత్యనారాయణ, మెడికల్ అధికారులు డాక్టర్ నవత, అనూష ఉన్నారు.
వనపర్తి టౌన్: గురుకుల భవనానికి అద్దె చెల్లించడం లేదని యజమాని గేటుకు తాళం వేశాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా నాగవరంలో చోటుచేసుకున్నది. పెద్దమందడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, మహిళా డిగ్రీ కళాశాలను నాగవరంలోని ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. ఎనిమిది నెలలకు గాను రూ.60 లక్షల అద్దె బకాయి పడటంతో ఆ భవనం యజమాని తాళం వేశాడు. దీంతో విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు అక్కడే నిరీక్షించారు. త్వరలో బకాయిలు చెల్లిస్తామని ఉన్నతాధికారులు యజమానికి ఫోన్లో హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం తర్వాత తాళం తీశాడు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎస్పీ భుజంగరావు మరో కేసులో చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్పల్లి సర్వే నంబర్ 1007లో అబ్బాస్ అలీఖాన్ కుటుంబసభ్యులకు సంబంధించి 340 ఎకరాల స్థలంపై వివాదం కొనసాగుతున్నది. కోర్టు పరిధిలో ఉండగానే శ్రీనివాస్, అనిల్, ఎస్ఎస్ మోయినుద్దీన్ నకిలీ పత్రాలను సృష్టించి ఆ భూమిని కబ్జా చేశారు. అప్పట్లో కూకట్పల్లి ఏసీపీగా పనిచేసిన భుజంగరావు కబ్జాదారుకు వత్తాసు పలకడంతోపాటు తమను బెదిరించినట్టు బాధితులు ఈ నెల 5న సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ ఆదేశాల మేరకు నిందితులపై ఈవోడబ్ల్యూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, భుజంగరావును నాలుగో నిందితుడిగా చేర్చారు.