హైదరాబాద్, జూన్8 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ మరో కొత్త నిబంధన పెట్టింది. సొసైటీ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులు, తల్లిదండ్రులు లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఫౌండేషన్ కోర్సులో అడ్మిషన్ కల్పించాలని గురుకుల ప్రిన్సిపాల్స్‌కు సొసైటీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఐఐటీ, నీట్ తదితర పోటీపరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసిన 9 గురుకులాల్లో ఫౌండేషన్ కోర్సులు నిర్వహిస్తున్నది.
సొసైటీ గురుకులంలో 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఫౌండేషన్ కోర్సులో 8వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నది. ఇష్టపూర్వకంగానే అడ్మిషన్ తీసుకున్నానని, శిక్షణ పూర్తయ్యేవరకూ క్రమశిక్షణతో నడుచుకుంటానని, నియమ, నిబంధనలు, టైం టేబుల్ పాటిస్తానని, ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాల్సి ఉంది. పరీక్షల్లో 70 శాతం మార్కులు రానట్టయితే పూర్వ పాఠశాలకు స్వచ్ఛందంగా వెళ్తానని స్పష్టంగా రాసివ్వాలని సొసైటీ నిర్దేశించింది.