నాగారం, ఏప్రిల్ 20: సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఫణిగిరి గుట్టపై పార్వతీదేవి శిల్పం వెలుగులోకి వచ్చింది. ఈ గుట్టపై పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుట్ట ఎక్కడానికి ముందున్న చిన్న గుహలో పార్వతీదేవి శిల్పాన్ని ఆయన గుర్తించారు. ఈ గుహ సుమారు 6 ఫీట్ల పొడవు, వెడల్పుతో 4 ఫీట్ల ఎత్తులో ఉన్నట్టు రత్నాకర్‌రెడ్డి తెలిపారు.
గుహలో దీర్ఘచతురస్రాకారంలో రెండు ఇంచుల లోతులో పానమట్టం మధ్యలో ఉబ్బెత్తుగా రెండు శివలింగాలను తొలిచారని, ఇలా ఐదు జంట శివలింగాలు ఉన్నాయని చెప్పారు. గుహ లోపల వెనుక భాగంలో నాలుగు ఇంచుల ఎత్తులో ఆసీనురాలైన దేవతా శిల్పం చెక్కి ఉందని, బహుశా పార్వతీదేవి శిల్పం కావొచ్చని పేర్కొన్నారు. గుహ పక్క నుంచి తొలిచిన చిన్న దిగుల్ల సాయంతో వెళ్తే మరో శిల్పం పూర్తిగా చెక్కకుండా వదిలి ఉందని, అది బహుశా భైరవ శిల్పమై ఉండొచ్చని రత్నాకర్‌రెడ్డి వివరించారు.