హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖ (Endowment Department) పరిస్థితి అయోమయంగా ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల నుంచి విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితి నెలకొన్నది. 22 నెలల్లో ఆరుగురు అధికారులు మారడం, అదికూడా పట్టుమని ఏడాదికి మించి ఎవరూ ఉండని కారణంగా ఈ శాఖపై పర్యవేక్షణ లోపిస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, సౌకర్యాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతేగాక పూర్తిస్థాయి కమిషనర్, డైరెక్టర్ లేకపోవడంతో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
పలు దేవస్థానాలకుజూలైలో పంపిన టెండర్లు ఇప్పటికీ సంతకాలు కాలేదు. వాటి కాలపరిమితి పూర్తయినా అప్రూవల్ రాలేదు. ఒక ఆలయంలో అన్ని టెండర్లు నవంబర్ 1తో ముగిసినా ఆమోదం లభించక అధికారులతో పాటు టెండర్‌దారులు అయోమయంలో పడ్డారు. ప్రమోషన్లు, బదిలీల విషయంలో గత కమిషనర్ ఎన్నిసార్లు లిస్ట్ అడిగి తీసుకున్నా సాక్షాత్తు మంత్రి కూడా ఉద్యోగుల పదోన్నతులపై నిర్ణయం తీసుకోవాలని చెప్పినా మార్పు లేదు.
ఈ శాఖకు పూర్తిస్థాయి కమిషనర్ లేక ఆలయాల్లో అభివృద్ధి పనులు, భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. బదిలీలు, ప్రమోషన్లు, పోస్టింగుల విషయంలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. కీలకమైన ఫైల్స్ పెండింగ్ ఉండడం వల్ల టెండర్లు, కొనుగోళ్లు, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం, అమలులో తీవ్రజాప్యం జరుగుతున్నది.
శాఖకు కమిషనర్‌గా కానీ, డైరెక్టర్‌గా కానీ ఎవరొచ్చినా పట్టుమని ఏడాది కూడా కొనసాగడం లేదు. గడిచిన 22 నెలల్లో ముగ్గురు ఇన్చార్జి కమిషనర్లతో పాటు ముగ్గురు డైరెక్టర్లు మారారు. పూర్తిస్థాయి అధికారి లేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. 2019 నుంచి 2024 ఏప్రిల్ వరకు అనిల్‌కుమార్ కమిషనర్‌గా కొనసాగారు. అదే ఏడాది ఏప్రిల్‌లో హనుమంతరావు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు పనిచేశాక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో హనుమంతు కొడింబాను నియమించారు. నెల గడవకముందే ఆయన్ను మార్చారు. 2024 నవంబర్‌లో శ్రీధర్‌ను కమిషనర్‌గా నియమించగా ఆయన కేవలం ఐదు నెలలే కొనసాగారు. ఆ తర్వాత నియమితులైన వెంకట్రావు ఈ ఏడాది ఏప్రిల్ 30న బాధ్యతలు చేపట్టగా, ఆయన అదనంగా యాదగిరిగుట్ట ఈవో బాధ్యతలు అప్పగించారు. ఆయన పదవీకాలం ఇటీవల పూర్తికావడంతో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌కు ఇన్చార్జి కమిషనర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా జెన్కో సీఎండీ హరీశ్‌కు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. బొగ్గులకుంటలోని హైదరాబాద్ ఎండోమెంట్ కమిషనరేట్ ఉద్యోగులు, సిబ్బంది పనితీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.