హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీపై సిట్ విచారణ చివరి దశకు చేరుకున్నది. ఇప్పటికే నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు పేపర్ కస్టోడియన్ శంకర లక్ష్మి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యుడు లింగారెడ్డిని సిట్ ప్రశ్నించింది. కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి వాంగ్మూలం కూడా రికార్డు చేయనున్నట్టు తెలిసింది. ప్రశ్న పత్రాలను సురక్షితంగా ఉంచాల్సిన కస్టోడియన్ ఎవరి నేతృత్వంలో పనిచేస్తున్నారు? ఆమె ప్రతిరోజు ఎవరికి రిపోర్టు చేయాలి? తదితర అంశాలపై సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నుంచి కొంత సమాచారం సేకరించారు. మరింత సమాచారం కోసం కమిషన్ చైర్మన్‌ను విచారించి, ఆయన వాంగ్మూలం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు వారు కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డిని సోమవారం కలిసే అవకాశాలున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా గ్రూప్-1 పేపర్ పంచుకున్న సురేశ్, రమేశ్, షమీమ్ల ఐదు రోజుల విచారణ ముగియడంతో వారిని తిరిగి రిమాండ్‌కు పంపించారు.
ఏఈ పేపర్ లీక్‌లో
ఏఈ పేపర్ లీక్ కేసులో నిందితులైన కాంట్రాక్టర్ ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్, తిరుపతయ్యను విచారణ నిమిత్తం సిట్ అధికారుల కస్టడీకి ఇచ్చే విషయమై కోర్టు సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ ముగ్గురిని ప్రశ్నిస్తే.. వీరితో ఇతరులకు ఉన్న లింక్‌లు బయటకు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. తిరుపతయ్య కూడా కాంట్రాక్టర్ కావడంతో తనకు తెలిసిన వారందరికి ఈ విషయం చెప్పి ఉంటాడని అనుమానిస్తున్నారు. డబ్బులే లక్ష్యంగా ఢాక్యా, రాజేందర్ పేపర్ విక్రయం కోసం తిరిగారు. దీంతో ఈ ఇద్దరు ఎంత మేర డబ్బు సంపాదించారనే విషయంలో మరింత స్పష్టత కోసం సిట్ ప్రయత్నిస్తున్నది. ఈ ముగ్గురిని విచారించడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా రేణుక, ఢాక్యా దంపతులకు ఏఈ ప్రశ్న పత్రం అందగా, దానిని రేణుక తన సోదరుడు రాజేశ్వర్‌తో కలిసి నీలేశ్, గోపాల్‌కు రూ.14 లక్షలకు విక్రయించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రేణుక ప్రమేయం లేకుండానే ఢాక్యా, రాజేశ్వర్‌లు తిరుపతయ్య ద్వారా ప్రశాంత్‌రెడ్డి వద్ద రూ.7.5 లక్షలు, రాజేంద్రకుమార్ వద్ద రూ.10 లక్షలకు పేపర్‌ను బేరం పెట్టారు. ఇందులో రాజేంద్రకుమార్ ముందుగా రూ.5 లక్షలు ఇవ్వగా, మిగతావి ఫలితాలు వచ్చిన తరువాత ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నారు. ఈ బేరంలో రూ.12.5 లక్షల వరకు వసూలు కాగా అందులో నుంచి రూ.8 లక్షల వరకు రాజేందర్, తిరుపతయ్య తమ కాంట్రాక్టు పనుల కోసం వాడినట్టు తెలిసింది. బిల్లులు వచ్చిన తరువాత వాటాలు వేసుకుందామని చర్చించుకున్నట్టు సిట్ విచారణలో వెల్లడైంది.