ఖమ్మం సిటీ, జూన్ 16: ‘కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియ కొనసాగుతున్నది. అనేక ప్రాంతాల్లో ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మంలో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్పై జాగ్రత్తగా ఉండాలి’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అంశాలపై బీఆర్ఎస్ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్ కమిటీ సభ్యులకు ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్)లో మంగళవారం అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ అంశాల గురించి పార్టీ నియోజకవర్గ నేతలకు మాజీ మంత్రి అజయ్‌తోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విశదీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఓటునూ కాపాడే బాధ్యత బూత్ లెవల్ కమిటీ సభ్యులు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా పరిశీలన నేపథ్యంలో ఓటర్లు అవసరమైన ధ్రువీకరణపత్రాలు లేక ఇబ్బందులు పడితే బీఆర్ఎస్ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉంటూ వాటిని సమకూర్చడంలో సహకారం అందించాలని సూచించారు.
2002 జాబితా ఆధారంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత వచ్చినట్లయితే అధికారులు అడిగిన అన్నిరకాల ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని సూచించారు. ప్రక్రియ అమలులో ఎదురయ్యే లోపాలను అధిగమించేందుకు ఇక నుంచి ప్రతి పదిహేను రోజులకోసారి సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తూ, ప్రజల ప్రేమానురాగాలను పొందేవారికి సభ్యత్వాలను ఇవ్వాలని సూచించారు. నాయకుడి నుంచి కార్యకర్త వరకు సమిష్టిగా పనిచేస్తే ఎన్నిక ఏదైనా గులాబీ జెండాదే విజయమని స్పష్టంచేశారు.