జయశంకర్ భూపాలపల్లి, మే 18 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనంగా మారిన సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల నియామకం దందాకు తాత్కాలికంగా తెరపడింది. దళారుల కొలువుల దందాపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై సింగరేణితోపాటు విజిలెన్స్ అధికారులు విచారణ కొనసాగించడంతో దళారుల్లో వణుకు పుట్టింది. సింగరేణి సెక్యూరిటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కనిపించే దళారులు ‘నమస్తే’ కథనంతో కనుమరుగయ్యారు. కార్మిక సంఘానికి చెందిన కొందరు నేతలతో దళారులు పైరవీలు కొనసాగించి ఇప్పుడు పత్తా లేకుండాపోయారు.
భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి ప్రైవేటు సెక్యూరిటీ రిక్రూట్మెంట్పై ప్రత్యేక దృష్టిసారించారు. ఎంతమంది గార్డులున్నారు? రిలీవర్లు ఎంత మంది ఉన్నారు? ఇంకా ఎంత మంది అవసరం? తదితర వివరాలతోపాటు వసూళ్లకు తెరలేపిన దళారులపై కూపీ లాగుతున్నారు. మరోవైపు రెండు రోజులుగా కొలువుల దందాపై విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నెల రోజులపాటు కొలువుల నియామకాన్ని వాయిదా వేయాలని కాంట్రాక్టర్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.