నమస్తే తెలంగాణ, నెట్వర్క్: రైతులకు యూరియా కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు యూరియా అడుక్కునే పరిస్థితి దాపురించింది. పోలీసుల వద్ద టోకెన్ల కోసం చేతులు చాచి అడుగుతున్నారు. బేల మండలం డోప్తాల పీఏసీఎస్ కేంద్రం వద్ద శుక్రవారం రైతులు పోలీసులకు దండంపెట్టి టోకెన్లు అడిగిన తీరు దయనీయ పరిస్థితిని తెలియజేస్తున్నది. అయినా టోకెన్ల కోసం వచ్చిన రైతును అక్కడి ఏఎస్ఐ జీవన్‌కుమార్ మోచేతితో నెట్టేసి, చెయ్యెత్తి దౌర్జన్యం ప్రదర్శించారు. ఏఎస్ఐ తీరుపై అక్కడున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఆ వీడియో తీసిన వ్యక్తిపై వ్యవసాయ శాఖ అధికారులు బేల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో యూరియా దొరుకుతుందో లేదోనని గురువారం అర్ధరాత్రి నుంచే రైతులు అక్కడి రైతు వేదికలోనే నిద్రించారు. యాదాద్రి జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద నడి ఎండలో క్యూలైన్లో ఉన్న రైతులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి ఆధ్వర్యంలో పండ్లు, తాగునీరు అందించి బాసటగా నిలిచారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం యూరియా కోసం రైతులు తుంగతుర్తి- నాగారం ప్రధాన రోడ్డుపై బైఠాయించారు.
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో అర్ధరాత్రి నుంచే సొసైటీల ముందు గంటలకొద్ది నిల్చున్నా, ఒక్క బస్తా కూడా యూరియా దొరకపోడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో అర్వపల్లిలోని పీఏసీఎస్ కేంద్రం ఎదుట జనగాం- సూర్యాపేట జాతీయ రహదారిపై రైతులు గంటసేపు ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి సొసైటీ వద్ద చెప్పులు వరుసలో పెడితే కూపన్లు, యూరియా ఇచ్చేది లేదని చెప్పడంతో, రైతులు వరుస క్రమంలో తమ ద్విచక్ర వాహనాలు పెట్టారు. అయితే గతంలో ఇచ్చిన కూపన్లు చెల్లవని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘ (సొసైటీ) కార్యాలయం, జిన్నింగ్ మిల్లు ప్రాంగణానికి యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. కూపన్ల కోసం రైతులందరూ ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. ఈ క్రమంంలో మండల వ్యవసాయాధికారి అశోక్‌కుమార్ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. తెల్లవారుజాము నుంచి యూరియా కోసం ఎదురుచూస్తున్నా పంపిణీ చేయలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా యూరియా బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా పాన్గల్లో బీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.
సరిపడా యూరియా అందడం లేదని ఆరోపిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేటలో బీఆర్ఎస్, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాధన్నపేట, నాగుర్లపల్లి, పర్శనాయక్ తండా, భోజ్యనాయక్ తండా రైతులు పాల్గొన్నారు. గోడౌన్లో యూరియా బస్తాలు ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో రైతులు రాస్తారోకో చేశారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో యూరియా కోసం కలకత్తా తండాకు చెందిన బాలింత వాంకుడోత్ జమీల తన రెండున్నర నెలల చిన్నారితో క్యూలో నిల్చున్నది. లైన్లో ఉన్న మహిళలు మానవత్వంతో అమెకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. రైతులకు సరిపడా యూరియా అందజేయాలని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. యూ రియా పక్కదారి పట్టడంతో రైతులు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఏవోను నిలదీశారు. హనుమకొండ జిల్లా శాయంపేటకు వచ్చిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామ పరిధిలో ఉన్న రైతువేదిక వద్ద శుక్రవారం ఉదయం నుంచే యూరియా కోసం భారీ క్యూలైన్లో వేచి ఉన్న రైతులు
యూరియా కోసం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి కుటుంబాలతో సహా వచ్చిన రైతులు. యూరియా దొరక్కపోవడంతో తుంగతుర్తి-నాగారం మెయిన్ రోడ్డుపై బైఠాయించిన రైతులు
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురంలో ఉన్న పీఏసీఎస్ గోడౌన్ వద్ద ఎండలోనే లైన్లో నిల్చున్న రైతులు
సరిపడా యూరియా బస్తాలు ఇవ్వాలని వనపర్తి జిల్లా పాన్గల్లో రాస్తారోకో చేస్తున్న రైతులతో మాట్లాడుతున్న అధికారులు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో యూరియా కోసం రెండున్నర నెలల చిన్నారితో క్యూలైన్లో నిల్చున్న బాలింత వాంకుడోత్ జమీల