హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కార్పొరేట్ బడుల్లో 4.66లక్షల మంది విద్యార్థులున్నట్టు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. అయితే ఈ స్కూళ్ల సంఖ్య 964 మాత్రమే. అంటే వెయ్యిలోపున్న ఈ స్కూళ్లల్లోనే 4.66లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నమాట. రాష్ట్రంలో 14 -15 విద్యాసంస్థలు ఒకే పేరుతో పలు ప్రాంతాల్లో బ్రాంచీలను నడుపుతున్నాయి. ఎన్రోల్మెంట్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ తాజాగా ఈ బడుల్లోని విద్యార్థుల వివరాలను సేకరించింది.
రాష్ట్రంలో మొత్తంగా 40వేల బడులున్నాయి. ఈ బడుల్లో 62లక్షల మంది విద్యార్థులున్నారు. అయితే 40వేల బడుల్లో 11వేలకు పైగా ప్రైవేట్ బడులుండగా వీటిలోనే 36.93లక్షల మంది విద్యార్థులున్నారు. అయితే 1,200 గురుకులాల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులుండగా, అంతకంటే తక్కువ గల కార్పొరేట్ బడుల్లో 4.66లక్షల మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలో 26వేల పైచిలుకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ బడులుండగా, వీటిలో ఎన్రోల్మెంట్ 16.78లక్షలు మాత్రమే.