హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక లేక స్టాక్యార్డ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు తీవ్రమైతే మరిన్ని ఇబ్బందులు తప్పేలాలేవని నిర్మాణరంగంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో ఏటా సగటున 170-175 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగం జరుగుతుంది. ఇసుకపై ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపు రూ.700 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. నదుల్లో వరద, రవాణా ఇబ్బందుల కారణంగా వర్షాకాలంలో ఇసుక సరఫరా తగ్గుతుంది. అందుకే వేసవిలోనే ఇసుక రీచ్లకు వెళ్లే రోడ్ల మరమ్మతులు పూర్తిచేసి, స్టాక్యార్డ్ల వద్ద ఇసుకను నిల్వలు ఉంచుతారు. కానీ ప్రభుత్వం, టీజీఎండీసీ అధికారులకు ముందుచూపు లేకపోవడమే ప్రస్తుతం కొరత ఏర్పడిందని నిర్మాణరంగసంస్థ ప్రతినిధులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం ఇసుక బజార్లు ఏర్పాటు చేసి టన్ను దొడ్డు ఇసుక ధర రూ.1600, సన్న ఇసుక రూ.1800గా నిర్ణయించింది. దీంతో బహిరంగ మార్కెట్లో ఆ ధర కాస్త రూ.2000కు పైగా పలుకుతున్నది. ప్రస్తుత కొరత, రానున్న సంక్షోభంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని ఇసుక వ్యాపారులు చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక రవాణా సులభంగా, ధరలు అదుపులో ఉండడంతో నిర్మాణరంగం వేగంగా అభివృద్ధి చెందిందని, ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచితమైన ఆంక్షలతోనే అమ్మకాలు పడిపోయాయని మండిపడుతున్నారు.