హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగులు పెండింగ్ బిల్లుల కథ మళ్లీ మొదటికొచ్చింది. తాజా వివరాల ప్రకారం.. పెండింగ్ బిల్లుల మొత్తం రూ.8వేల కోట్లకు చేరింది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంలో భాగంగా ప్రభుత్వం ప్రతినెలా కొంత నగదు విడుదల చేస్తున్నది. గతంలో రూ.11వేల కోట్ల బకాయిలుండగా.. ప్రతినెలా సర్కార్ ఎంతోకొంత చొప్పున విడుదల చేస్తున్నా మళ్లీ బకాయిలు పోగవుతున్నాయి. తొలుత నెలకు రూ.700 కోట్ల చొప్పున చెల్లించింది. ఆ తర్వాత రూ.1,000 కోట్లకు పెంచింది.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ క్లియర్ చేయడంలో భాగంగా సర్కార్ మూడు నెలలుగా రూ.2వేల కోట్ల చొప్పున విడుదల చేస్తున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్లు రూ.6 వేల కోట్లు క్లియర్ చేసింది. ఈ నెల నుంచి మళ్లీ రూ.2,000 కోట్లు విడుదల చేస్తుందా? లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నెల నుంచి నెలకు రూ.700 కోట్లు విడుదల చేసే అవకాశమే ఉన్నదని తెలుస్తున్నది. పెండింగ్ బిల్లులు రూ.8 వేల కోట్లకు చేరడంతో నెలకు రూ. 2,000 కోట్ల చొప్పున ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఒకవైపు ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లిస్తుండగా, మరోవైపు బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రతినెలా 500 మంది ఉద్యోగుల రిటైర్డ్ అవుతున్నారు. వీరికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ నెలకు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్లు అవసరం అవుతున్నాయి. 2027 మార్చి వరకు నెలకు రూ.2,000 కోట్ల చొప్పున విడుదల చేస్తేనే బిల్లుల బకాయిలు తీరుతాయి. అంతకు తక్కువగా నగదు విడుదల చేస్తే 2028 కూడా దాటే అవకాశం కనిపిస్తున్నది.
ఉద్యోగులు అడిగినవి ఇవ్వకుండా ప్రభుత్వం అడుగని వాటిని విడుదల చేసింది. ఉద్యోగులు సరెండర్ లీవులు (ఈఎల్), టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్స్యూరెన్స్, జీపీఎఫ్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. కానీ ప్రభుత్వం జడ్పీ జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్, కమ్యూటేషన్, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ క్లియర్ చేసింది. దీంట్లో కమ్యూటేషన్ 100శాతం క్లియర్ చేసింది. వాస్తవానికి దీనిని ఉద్యోగులు అడుగనేలేదు. రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు 10శాతం వాటాను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. ఇది కూడా చెల్లించడంలేదు.
నెలకు కొంత నగదు చొప్పున పెండింగ్ బిల్లులు విడుదల చేస్తున్నా.. మళ్లీ కొత్త బకాయిలు పోగవుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న ఆ కొద్ది మొత్తం నగదుతో పూర్తి బకాయిలు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలే కాకుండా రెగ్యులర్ ఉద్యోగుల బకాయిలు కూడా చెల్లించాల్సి ఉన్నది. నెలనెలా రూ.2 వేల కోట్ల చొప్పున విడుదల చేయాలి. అలా చేస్తేనే పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అవుతాయి. లేదంటే ఈ బకాయిలు పేరుకుపోతాయి.
– పింగిలి శ్రీపాల్రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
మూడేండ్లు గడిచినా మా సమస్యలు తీరడమే లేదు. ఇంకా ఎంతకాలం ఓపిక పట్టాలి. సహనానికీ ఓ హద్దు ఉంటుంది. మా ఓపిక నశిస్తున్నది. ముఖ్యమంత్రి చర్చలకు పిలిచి హామీలిచ్చినప్పుడు కూడా అమలుకాకపోతే ఇంకెవరికీ చెప్పుకోవాలి. ప్రధాన డిమాండ్లు కూడా పరిష్కరించకపోవడం బాధాకరం. మేం ఎంత మొత్తుకుంటున్నా, ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసినా? ఫలితం దక్కడం లేదు. ప్రతిసారీ డబ్బుల్లేవంటున్నారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదు.
– మారం జగదీశ్వర్, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్