హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అధికారపక్షం సుమారు నాలుగు గంటలపాటు తర్జన భర్జన పడింది. జగదీశ్‌రెడ్డి ప్రసంగంలో తప్పు దొర్లిందని, ఆయన వ్యాఖ్యలు స్పీకర్‌ను అగౌరవపరిచేలా ఉన్నాయని తొలుత అధికారపక్షం ఆందోళనకు దిగింది. జగదీశ్‌రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధం కాదని జగదీశ్‌రెడ్డి వాదించారు. జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఆయనను వారించాలని ట్రెజరీ బెంచ్ నుంచి ఉద్దేశపూర్వకంగానే మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొడవకు దిగారని బీఆర్ఎస్ సభ్యులు ప్రతిస్పందించారు. అటు కాంగ్రెస్ సభ్యులు, ఇటు బీఆర్ఎస్ సభ్యులు పరస్పర అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ఇరుపక్షాల సభ్యుల నినాదాలతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొన్నది. శాసనసభలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఉదయం 11.30 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సభను 15 నిమిషాలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు శాసనసభ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి.
వాయిదా పడి తిరిగి ప్రారంభమైన నాలుగు గంటలపాటు సభాప్రాంగణంలో అంతా ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని, ఆయన సభ్యత్వాన్నే రద్దు చేయాలని అధికారపక్షం సభలో డిమాండ్ చేయటంతో ‘ఏం చేద్దాం?’ అనే అంశంలో అధికారపక్షం మల్లగుల్లాలు పడింది. సభ ప్రారంభంకాగానే ఉముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్కతోపాటు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, రామచంద్రనాయక్, మందుల సామేల్ మాట్లాడారు. అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ఈ సెషన్స్ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీనిపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించి ఈ సెషన్స్ వరకు జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటిస్తుండగానే, ఆయన సభ నుంచి నిష్క్రమించారు. మొత్తానికి అసెంబ్లీ లోపలా, బయటా నాలుగు గంటలపాటు ఏం జరుగుతున్నదోననే ఉత్కంఠ వాతావరణం నెలకొనడం గమనార్హం.
సభను వాయిదా వేయగానే బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ చాంబర్‌కు వెళ్లి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని కోరారు. ఆ తర్వాత మంత్రులు స్పీకర్‌తో దాదాపు గంటన్నరపాటు సమాలోచనలు జరిపారు. అసెంబ్లీ ప్రవర్తనా నియామవళిని పరిశీలించాలని అధికారులను పురమాయించారు. ఏంచేస్తే బాగుంటుంది? అన్న విషయంలో ఆరా తీశారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితోనూ మంతనాలు సాగించారు.