వనపర్తి : కేంద్రం చక్రవర్తి కాదు..రాష్ట్రాలు సామంతులు కాదు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని వ్యవవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వనపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. తెలంగాణ రైతుల శాపం ఊరికే పోదు. తెలంగాణ పై వివక్షను కొనసాగిస్తున్నదని మంత్రి మండిపడ్డారు.
తెలంగాణ వరి ధాన్యం కొనాలన్న రైతుల పోరాటానికి కేంద్రం తలొగ్గాల్సిందే. దేశంలో ఎక్కడ పండించిన పంట అయినా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలు తెలంగాణకు కొత్త కాదు. సీఎం కేసీఆర్ ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించారు.
అదే స్ఫూర్తితో కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తామన్నారు. త్యాగాలకోసం పుట్టింది తెలంగాణ. వ్యాపారం కోసం పుట్టింది గుజరాత్ రాజకీయ నేతలని విమర్శించారు. మోసాల కేంద్రాన్ని ఇంటికి సాగనంపాలి . ప్రతి ఇంటి మీద నల్లజెండాలు ఎగరేయండి. తెలంగాణ దెబ్బకు ఢిల్లీ దిగిరావాలన్నారు.