మొయినాబాద్, డిసెంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘానికి కమిషనర్‌గా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రంగారెడ్డి జిల్లాలో తన పొలం నుంచి పారుతున్న వరద కాలువను పూడ్చాడు. భూగర్బ జలాలను పెంచేందుకు ప్రభుత్వ నిధులతో నిర్మించిన చెక్ డ్యామ్‌ను మాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఆయన ప్రయత్నం బెడిసి కొట్టడంతో కాలువను యథాతథంగా వదిలేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 487లో రమేశ్ కుమార్ 15 ఏండ్ల క్రితం 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ పక్కనే 488 సర్వే నంబర్లో ఆభరణాల వ్యాపారి సుమిత్ 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.
రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మ్యాపుల ప్రకారం 488 సర్వే నంబర్లో వరద కాలువ ఉన్నది. కానీ, సర్వే నంబర్ 487లో వంపు ప్రాంతం ఉండటంతో వరద కాలువ దానిలో నుంచి వెళ్లింది. 25 ఏండ్ల క్రితం ఆ వరద కాలువపై ప్రభుత్వ నిధులతో చెక్ డ్యామ్‌ను నిర్మించారు. ఇటీవల రమేశ్ కుమార్ తన భూమిలో నుంచి ఉన్న వరద కాలువను మట్టితో పూడ్చి వేయడంతోపాటు చెక్ డ్యామ్‌పై కూడా మట్టిపోసి కనిపించకుండా చేశాడు. దీనిపై అధికారులకు సమాచారం అందడంతో రెండు రోజుల క్రితం అక్కడ పనులను నిలిపివేయించారు. సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన తాసిల్దార్ గౌతం కుమార్.. చెక్ డ్యామ్, వరద కాలువపై పోసిన మట్టిని తీసివేయించి ఆ కాలువను పునరుద్ధరించారు. వరద కాలువను పూడ్చేందుకు ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
హాలియా, డిసెంబర్ 29 : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ఎక్సైజ్ అధికారుల వేధింపులు భరించలేకుండా ఉన్నానని హాలియాకు చెందిన మద్యం వ్యాపారి విద్యాసాగర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఆత్మహత్య చేసుకుంటే ఎక్సైజ్ అధికారులతో పాటు వైన్స్ ప్రసాద్‌దే బాధ్యత అని పేర్కొన్నా రు. సోమవారం హాలియాలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విద్యాసాగర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైన్స్ ప్రసా ద్ తాను కలిసి 1980 నుంచి మద్యం వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. అభిప్రాయ భేదాలు రావడంతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. దుకాణం ప్రారంభించేందుకు అధికారు లు అనుమతి ఇవ్వడంలేదని ఆరోపించారు. నిరసనగా హాలియా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బాతో నిరసన వ్యక్తంచేశారు.