Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనతో ఏపీ రిటైర్డ్ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లకు తెలంగాణ రాష్ట్రం ఓ పునరావాస కేంద్రంగా మారిందా? తెలంగాణలో తెలివిగలవారే లేరన్నట్టు రాష్ట్రంలోని కీలక సంస్థల బాధ్యతలను ఏపీ మూలాలున్న వారికే కట్టబెడుతున్నారా? ఏపీకి చెందిన ఓ ‘ముఖ్య’ వ్యక్తి కనుసన్నల్లో వారికి తెలంగాణలో ఏదో విధంగా ఆశ్రయం కల్పిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. తెలంగాణలోని కీలక పదవులకు, ప్రభావవంతమైన సంస్థలకు ఆంధ్రప్రదేశ్ మూలాలున్న వ్యక్తులను నియమించడం ఈమధ్య పరిపాటిగా మారింది.
ఏపీ మూలాలున్న ఆదిత్యనాథ్‌దాస్‌ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించడంపై ఇప్పటికే పెద్ద దుమారం రేగింది. త్వరలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ట్రిబ్యునల్ చైర్మన్ పదవిని కూడా ఏపీకి చెందిన వ్యక్తికే కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ఆర్టీఐ కమిషనర్‌గా కూడా ఏపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహించిన మరో వ్యక్తిని నియమించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
ఇటీవల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా పోలీస్ కైంప్లెంట్ అథారిటీ చైర్మన్‌గా ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ శివశంకర్‌రావును నియమించింది. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలంలోని సాకుర్రు గ్రామం. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన న్యాయశాస్ర్తాన్ని అభ్యసించారు. వాణిజ్యశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్‌లోని హైకోర్టు ఆఫ్ జ్యుడీషియేచర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. డాక్టర్ శివశంకర్‌రావును కాకుండా రాష్ట్ర, జిల్లా పోలీస్ కైంప్లెంట్ అథారిటీ చైర్మన్‌గా నియమించేందుకు తెలంగాణ మూలాలున్న రిటైర్డ్ జడ్జి ఎవరూ లేరా? అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తున్నది.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అప్పిలేట్ అథారిటీ చైర్మన్‌గా ఏపీకి చెందిన జస్టిస్ సాంబశివరావును నియమించారు. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించినప్పటికీ ఏపీ మూలాలు ఉండటం వివాదాస్పదంగా మారింది. తెలంగాణలో రిటైర్డ్ జడ్జీలు చాలా మందిఉన్నందున వారిలో ఒకరిని పీసీబీ అప్పిలేట్ అథారిటీ చైర్మన్‌గా నియమిస్తే బాగుండేదని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ అథారిటీలో మరో ఇద్దరు సభ్యులను నియమించాల్సి ఉండగా.. ఓ సభ్యుడి విషయంలో వివాదం తలెత్తి, దాదాపు నెల రోజుల నుంచి ప్రతిష్టంభన కొనసాగుతున్నది. దీంతో పీసీబీ అప్పిలేట్ అథారిటీ నియామక ఉత్తర్వులు నిలిచిపోయాయి.
తెలంగాణలో మానవీయ దృక్పథం ఉన్నవారు, ప్రజా సమస్యలను పరిష్కరించేవారే లేరన్నట్టు ఇటీవల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడి నియామకం జరిగింది. ఆ పదవిలో ఆంధ్రా మూలాలున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బీ కిశోర్‌ను నియమించారు. ఎమ్మెస్సీ అగ్రికల్చర్, ఎల్ఎల్బీ చేసిన ఆయన ఐఏఎస్‌గా పలు విభాగాలతోపాటు టీటీడీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఏపీకి సేవలందించారు. సాధారణంగా మానవ హక్కుల కమిషన్ సభ్యుడి పోస్టును సామాజిక కార్యకర్తలకు ఇస్తారు. బ్యూరోక్రాట్లకు ఇవ్వడం చాలా అరుదు. కానీ, తెలంగాణలో మానవ హక్కులు, సమస్యలపై స్థానికులెవరికీ అవగాహన లేదన్నట్టు డాక్టర్ కిశోర్‌ను నియమించడం వివాదాస్పదంగా మారింది.