హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్-2026 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్యాల బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది 93.60% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఈసెట్ పరీక్షను ఈ నెల 15న నిర్వహించారు. ఈ సారి 18,626 మంది దరఖాస్తు చేసుకోగా, 17,870 మంది పరీక్షకు హాజరుకాగా, 16,726 మంది క్వాలిఫై అయ్యారు. ఈసెట్‌లో ఎప్పటిలాగే అమ్మాయిలు సత్తాచాటారు.
అమ్మాయిలు 95.02% క్వాలిఫై కాగా, అబ్బాయిలు 92.67% క్వాలిఫై అయ్యారు. పాలిటెక్నిక్, బీఎస్సీ(గణితం) కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకు ఆధారంగా బీటెక్ రెండో సంవత్సరంలో(ల్యాటరల్ ఎంట్రీ) ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల భర్తీ కౌన్సెలింగ్ జూన్‌లో ప్రారంభంకానున్నది. జూలై 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలోని 179 ఇంజినీరింగ్ కాలేజీల్లో పలు బ్రాంచీల్లో మొత్తం 21,200 వేల సీట్లున్నాయి. 2025లో 10,899(50% సీట్లు) భర్తీ అయ్యాయి.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 11 విభాగాలకు పరీక్షలు నిర్వహించగా, టాపర్లు, ఫలితాల వివరాలిలా ఉన్నాయి.

