హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): అటవీ శాఖకు 2022 సంవత్సరం కలిసొచ్చింది. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని ప్రధాన ప్రాంతాల నుంచి గ్రామాల తరలింపు, ఒకేరోజు 6 అర్బన్ పారుల ప్రారంభం, పెరిగిన పరిరక్షణ కార్యకలాపాలు, పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి పులుల వలస, అటవీశాఖలో 1,658 పోస్టుల భర్తీ నిర్ణయం తదితర అంశాలు అత్యంత అనుకూలంగా మారాయి. పులుల అభయారణ్యంలోని గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించడం అటవీశాఖకు ఏండ్ల తరబడి సవాల్‌గా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సహాయ సహకారంతో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోని రాంపూర్, మైసంపేట గ్రామాల తరలింపు విజయవంతంగా పూర్తయ్యింది. పునరావాసం కింద ఈ గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం లేదా వ్యవసాయ భూమి కేటాయింపు, ఇంటి స్థలం, ఇతర ప్రయోజనాలతోపాటు రెండూ అందించారు. ఇప్పుడు మరిన్ని గ్రామాల తరలింపునకు అటవీ శాఖ కసరత్తు చేస్తున్నది.
హరితనిధితో తీరిన ఇబ్బందులు
హరితహారానికి నిధులు కొరత రాకుండా ఉండేందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరుల భాగస్వామ్యంతో ప్రభుత్వం హరితనిధిని ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటివరకు రూ.23.33 కోట్లు జమయ్యాయి. అటవీ విస్తీర్ణం పెంపునకు చేపట్టిన అన్ని చర్యలను కేంద్రం ప్రశంసించింది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2021 ప్రకారం తెలంగాణలో 21,214 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉన్నది. 2019తో పోల్చితే 632 చదరపు కిలోమీటర్లు పెరిగిందని, ఇది దేశ అటవీ విస్తీర్ణంలో రెండో అత్యధిక పెరుగుదల అని కేంద్ర అటవీశాఖ సహాయమంత్రి అశ్వినికుమార్ అన్నారు.
అటు.. రాష్ట్రవ్యాప్తంగా చూడచక్కగా తీర్చిదిద్దిన 6 అర్బన్ పారులను జూలై 28న అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ నెల 12న నల్లగొండలో లక్ష మొకలు నాటి రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల అంచనాతో త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా కోసం వివిధ ప్రాంతాల్లో 3,146 గిరిజన గ్రామాలను గుర్తించింది. వీటిలో 232 ఆవాసాలకు త్రీఫేజ్ కరెంటు సరఫరా చేయాల్సి ఉండగా, వీటిలో 50 ఆవాసాలు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా పరిమితికి మించి ఉన్నాయి. దీంతో వీటిల్లో పనులు చేపట్టేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎవాల్యుయేషన్ బృందం అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులను తనిఖీ చేసి రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన కార్యక్రమాలను అభినందించింది.
ఇతర కీలక అంశాలు