Telangana | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : కొత్త ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టగానే.. కొత్త ఎన్జీవోలు రంగ ప్రవేశం చేస్తాయి. ఈ ప్రోగ్రామ్.. ఆ ప్రోగ్రామ్ అంటూ హడావుడి చేసేస్తాయి. ఆయా ఐఏఎస్ అధికారి మారగానే అవన్నీ మూలనపడతాయి. ఆ తర్వాత మళ్లీ పాత కథే మొదలవుతుంది. ఇది విద్యాశాఖలో జరుగుతున్న నిత్య తంతు. పాఠశాల విద్యాశాఖలో మూడు నాలుగు స్వచ్ఛందసంస్థ లు(ఎన్జీవోలు) చెప్పిందే వేదంగా నడుస్తున్నదని తెలుస్తున్నది. ఈ ఎన్జీవోలకు ఉన్నతాధికారులు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్టు సమాచారం. కొత్తగా మరో రెండు, మూడు ఎన్జీవోలు రాబోతున్నాయని తెలుస్తున్నది.
ఆయా ఎన్జీవోలతో ఎంవోయూలు కుదుర్చుకునేందుకు రంగం సిద్ధమయ్యిందని సమాచా రం. ఓ ఎన్జీవో కంప్యూటర్లు కొనండి.. డిజిటల్ పాఠాల కంటెంట్‌ను సమకూరుస్తామని పేర్కొందట. దీంతో కిందిస్థాయిలోని విద్యాశాఖ అధికారులు తల లు పట్టుకుంటున్నారు. ఇదేం వ్యవహారమని విస్తుపోతున్నారు. ఇక ఎన్జీవోల జోక్యం పాఠశాల విద్యాశాఖను దాటి ఉన్నత విద్యాశాఖలోకి ప్రవేశించనున్నట్టు సమాచారం. ఇంటర్మీడియట్ విద్యలోనూ ఓ ఎన్జీవోను ప్రోత్సహించేందుకు ప్రయత్నం జరుగుతుందని తెలిసింది.
అసలే సర్కారు బడులకు పిల్లలే వస్తలేరంటే.. ఎన్జీవోలను ప్రోత్సహించి భ్రష్టు పట్టిస్తున్నారని విద్యాశాఖలోని ఓ అధికారి వాపోయారు. విద్యాశాఖను ప్రభుత్వం పాలిస్తున్నదా.. ఎన్జీవోలు పాలిస్తున్నాయా..? తెలియడం లేదంటూ మరో అధికారి ఆవేదన వ్యక్తంచేశారు. ఓ ఎన్జీవో వచ్చి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ అంటుంది.. మరొకరొచ్చి డిజిటల్ విద్య.. తెల్లారి మరొకరొచ్చి ఆర్టిఫీషియల్ ఇంటెలిజె న్స్ అంటారు. ఇలా రోజుకొకటి చొప్పున గందరగోళం సృష్టిస్తున్నారని విద్యాశాఖలోని అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఎన్జీవోలను ప్రోత్సహించే విషయంలో గతంలో ఓ ఇద్దరు ఐఏఎస్ అధికారుల మధ్య పంచాయితీ కూడా నడిచింది. ఓ అధికారి ఎన్జీవోలు చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పగా, ఎన్జీవోల మితిమీరిన జోక్యమేంటని మరో ఐఏఎస్ ప్రశ్నించారు.