హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): భారత్మాల పరియోజన ప్రాజెక్టు నుంచి తెలంగాణకు చెందిన ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్)ను తొలగించారు. దేశవ్యాప్తంగా 580 జిల్లాలను కలుపుతూ 34,800 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2017లో కేంద్రం భారత్మాల పరియోజనను చేపట్టింది. ఇందులోనే ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం పనులకు కూడా చోటు లభించింది. మొత్తం 346 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు మార్గంలో ఉత్తరభాగం 164 కిలోమీటర్లు కాగా, దక్షిణ భాగం 182 కిలోమీటర్లు. ఈ నేపథ్యంలో భారత్మాల పరియోజన లక్ష్యం మేరకు రోడ్డు ప్రాజెక్టుల మంజూరీ పూర్తయిపోయింది.
దేశవ్యాప్తంగా రూ.5,35,000 కోట్ల అంచనా వ్యయంతో 34,800 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి మంజూరీ ఇచ్చారు. ఇందులో కొన్ని ప్రాజక్టులు పూర్తికాగా, మరికొన్నింటి పనులు కొనసాగుతున్నాయి. మన రాష్ట్రంలో ట్రిపుల్ ఆర్కు మాత్రం వివిధ కారణాలతో ఇంతవరకు టెండర్లు కూడా పిలవలేదు. దీంతో ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం పనులకు భారత్మాలలో చోటు దక్కే అవకాశం లేకుండా పోయింది.
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత వికసిత్ భారత్ ప్రాజక్టులో ట్రిపుల్ ఆర్కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2047నాటికి దేశ సంపూర్ణ అభివృద్ధిని కాంక్షిస్తూ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇందులో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయనున్నారు. సుస్థిరాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల లక్ష్యంతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అవసరాలకు అనుగుణంగా నూతన రోడ్డు ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు అసంపూర్తిగా ఉన్నవాటిని ఇందులో పూర్తిచేయాలని నిర్ణయించారు.
తెలంగాణలోని ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు కూడా ఇంకా మొదలు పెట్టకపోవడంతో ఉత్తరభాగం పనులను యథావిధిగా భారత్మాలలో చేపట్టి, దక్షిణ భాగం పనులను వికసిత్ భారత్లో చేపట్టనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు భారత్మాల ప్రాజెక్టులో మంజూరై ఇంతవరకు ఎటువంటి పనులూ మొదలుకాని ప్రాజెక్టులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు పేర్కొన్నాయి. అయితే ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఉత్తరభాగంలో 85 శాతానికిపైగా భూసేకరణ పూర్తికావడం, టెండర్ల దశకు రావడంతో ప్రస్తుతం రద్దుచేసే అవకాశం లేదని వారు వివరించారు.