గోదావరిఖని, జనవరి 29 : అర్ధరాత్రి దొం గలు, నక్సలైట్లను నిర్బంధించినట్టు ప్రశ్నించే గొంతుకలను నిర్బంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేసి, మళ్లీ ప్రజల స మక్షంలో చేపట్టాలని ఎన్టీపీసీ యాజమాన్యా న్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే కేవలం అధికారపార్టీ నాయకులు మాట్లాడడమా..? లేక ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకుం డా అరెస్టు చేయడమా..? అని ప్రశ్నించారు. పోలీస్ నిర్బంధంలో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీలో 2400 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్ కోసం మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ పోలీస్ పహారాలో, ప్రజలు లేకుండా జరిగిందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి నేతలు రాకుండా అక్రమ అరెస్టులు చేశారని ఆగ్రహించారు. రామగుండంలో నిర్బంధపాలన కొనసాగుతున్నదని వాపోయారు. నాడు ఎన్టీపీసీ ప్లాంట్ ఏర్పాటుకు భూములను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు నేటివరకు విద్య, వైద్యం, ఉద్యోగావకాశాలు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని, పైగా బెదిరింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు.