కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. చారిత్రక మీరాలం చెరువుపై నిర్మాణంలో ఉన్న వంతెన డిజైన్ మార్పుపై తీవ్ర దుమారం రేగుతోంది. గత ప్రభుత్వ హయాంలో దుర్గం చెరువు తరహాలోనే మీరాలం కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి కట్టాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తొలుత ప్రణాళికలు రూపొందించి, పనులు చేపట్టింది.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): మీరాలం చెరువు పనులు మొదలుపెట్టిన తర్వాత కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకో, లేక కమీషన్లు దండుకొనేందుకో తెలియదు కానీ మొత్తానికి ఆ ప్రాంతానికి కేబుల్ బ్రిడ్జి లేకుండా చేస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేబుల్ బ్రిడ్జి స్థానంలో పిల్లర్ల వంతెన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేపట్టిన పనుల తనిఖీకి సంబంధించిన చిత్రాలు బయటకు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేబుల్ వంతెన నిర్మించాల్సిన చోట కాంట్రాక్టర్ సాధారణ పిల్లర్లతో బ్రిడ్జిని నిర్మిస్తుండటం చూసి ఇంజినీర్లు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. డిజైన్ మార్పులు చేసి నవంబర్ 2025లో కేఎన్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కు కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అయితే పనులు ప్రారంభమైన కేవలం మూడు నెలల్లోనే డిజైన్ ను మార్చి సాధారణ పిల్లర్ల నిర్మాణం చేపట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. చెరువులో నీళ్లు ఉండటం వల్లే డిజైన్ మార్చాల్సి వచ్చిందని కాంట్రాక్టర్ చెబుతున్న కారణంపై పర్యావరణ వేత్తలు, సాంకేతిక నిపుణులు ముకున వేలేసుకుంటున్నారు. 129 ఏళ్ల చరిత్ర ఉన్న తాగునీటి సరస్సులో నీళ్లు కాక ఇంకేముంటాయని వారు ప్రశ్నిస్తున్నారు.
కేబుల్ వంతెన నిర్మాణానికి అయ్యే వ్యయానికి, సాధారణ పిల్లర్ల బ్రిడ్జికి అయ్యే ఖర్చుకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి టెండర్ ఖరారయ్యాక నిబంధనలకు విరుద్ధంగా డిజైన్ మార్చడం వెనుక పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెంచ్ ఇంజినీర్లు నెక్లెస్ ఆకారంలో నిర్మించిన చారిత్రక బండ్ కు ఈ సాధారణ పిల్లర్ల కోసం తవ్వుతున్న వందలాది గుంతల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తకువ ఖర్చుతో పూర్తయ్యే పిల్లర్ల వంతెనను నిర్మిస్తూ కేబుల్ బ్రిడ్జి టెండర్ల మొత్తం వసూలు చేయడం వెనుక ఎవరి హస్తం ఉందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా దీనిపై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తుంది. అర్ధాంతరంగా ప్రజాధనాన్ని నేతల జేబుల్లోకి మళ్లించేందుకు ఈ తరహాలో డిజైన్లు మార్పులు చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విమర్శలు, అనుమానాలపై మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు పూర్తి స్థాయిలో స్పందించకపోవడం సందేహాలకు బలాన్నిస్తోంది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన ప్రభుత్వం, వెంటనే గుట్టుగా డిజైన్ మార్పుపై స్పష్టతనివ్వాలని, పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలను ప్రజల ముందు ఉంచాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.