భారతీయ శిల్పకళకు శిఖరాయమాన ప్రతీక రామప్ప. చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంపదకు ఉత్కృష్ట ఉదాహరణ రామప్ప. ‘వరల్డ్ హెరిటేజ్’ కిరీటాన్ని ధరించిన 800 ఏండ్ల ఆలయం.. ఇప్పుడు మైనింగ్ కోరల్లో చిక్కుకున్నది. గతంలో పలుమార్లు ప్రయత్నించి భంగపడిన కాంగ్రెస్ సర్కార్.. మళ్లీ ఇప్పుడు విధ్వంసక ఓపెన్‌కాస్ట్ గనికి అనుమతులిచ్చింది. 4.5 కిలోమీటర్ల దూరంలోనే జరిపే గని పేలుళ్లతో ఆలయం ప్రమాదంలో పడనున్నది.
ఎనిమిది వందల ఏండ్ల నాటి శిల్పకళా శిఖరం..
నీటి విశిష్టతను తెలిపే.. నీరే నాగరికతకు
పునాది అని చాటే వారసత్వపు జాడ..
సకల చరాచర సజీవ శిల్పాలతో జీవ వైవిధ్య
ప్రాముఖ్యాన్ని వివరించే సాంస్కృతిక పూదోట..
పేరిణి తాండవం, కోలాటం, ప్రేంఖణం, చిందు
నృత్యాలను దాచుకున్న దృశ్యపేటిక..
కాకతీయుల రాజకీయ, సామాజిక,
సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి పొంది,
తెలంగాణ వారసత్వ సంపదగా విశ్వఖ్యాతి
గడించిన గొప్ప కట్టడం..
తెలుగు రాష్ర్టాల్లో ప్రపంచ (యునెస్కో) గుర్తింపు పొందిన ఏకైక చారిత్రక, సాంకేతిక అద్భుతం..
మానవ జీవన పరిణామానికి సాక్షిగా..
కీలకమైన ఘట్టంగా నిలిచింది మన రామప్ప!
ఎన్నో దండయాత్రలు, విపత్తులను తట్టుకొని
నేటికీ సజీవ శిల్పకళా కోశంగా అలరారుతున్న రామప్ప ఆలయానికి ‘ఓపెన్ కాస్ట్’ రూపంలో
మళ్లీ మప్పు ముంచుకొస్తున్నది.
వెంకటాపూర్ ఓపెన్ కాస్ట్లో 1,088 ఎకరాల విస్తీర్ణంలో 300 మీటర్ల లోతులో బొగ్గు తవ్వకాలకు సింగరేణి డీపీఆర్ సిద్ధం చేసింది. తవ్విన బొగ్గును మరో 737 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ చేయనున్నది. దీన్ని 120 మీటర్ల ఎత్తులో గుట్టలుగా పోయనున్నది. ఇదే జరిగితే ఈ పచ్చని ప్రాంతమంతా కాలుష్యకాసారంగా మారుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం 2012లోనూ ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. చరిత్రకారులు, ప్రజల నిరసనలు, ఆందోళనలతో వెనక్కి తగ్గింది. రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ రాగానే రామప్ప ఆలయాన్ని ముప్పు ముంగిట నిలబెట్టింది.
వారసత్వ కట్టడానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఉద్దేపూర్వకంగా దూరాన్ని రికార్డు చేసిన అధికారులు, మైనింగ్‌కు ఈ ప్రాంతం అనుకూలమని పేర్కొంటున్నారు.
ఎయిర్ రూట్, రోడ్ రూట్లో వేర్వేరు దూరాన్ని అనుకూలంగా మార్చుతున్నారు. మైనింగ్ ప్రాంతం నుంచి రామప్ప ఆలయం 4.5 కిలోమీటర్లే ఉన్నది. అనుమతుల కోసం అధికారులు దీన్ని 5.5 కిలో మీటర్లుగా చూపిస్తున్నారు.
తెలంగాణ ఔన్నత్యానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు పీవీ నర్సింహారావు పేరుతో సింగరేణి సంస్థ ఇక్కడ చారిత్రక విధ్వంసానికి కారణమయ్యే ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టనుండడం మరింత విషాదం..
Ramappa Temple | (పిన్నింటి గోపాల్) వరంగల్, సెప్టెంబరు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పచ్చని అడవులు, పక్కన చెరువు.. బంగారం, మట్టి కలగలిపిన రంగులో అలరారే అద్భుత అందాల రామప్ప ఆలయం.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తలపెట్టిన ‘మైనింగ్ విపత్తు’తో విధ్వంసమయ్యే ప్రమాదం పొంచిఉన్నది. సామాన్యులు మెచ్చేలా పరిపాలన సాగించిన కాకతీయుల అద్భుత కట్టడంగా నిలిచి.. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప పక్కనే సింగరేణి ఆధ్వర్యంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్‌కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం 2012లోనూ ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. చరిత్రకారులు, ప్రజల నిరసనలు, ఆందోళనలతో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం చారిత్రక రామప్ప ఆలయ పరిరక్షణకు కృషి చేసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్(యునెస్కో) గుర్తింపును తెచ్చింది. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రామప్ప ఆలయాన్ని ప్రమాదం అంచున నిలబెట్టింది.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని కాకతీయులు అద్భుత శిల్పాకళా శైలితో నిర్మించారు. ప్రపంచంలోనే గొప్ప కట్టడాల్లో ఒకటిగా దీనికి మూడేండ్ల క్రితం యునెస్కో గుర్తింపు వచ్చింది. ఇలాంటి కట్టడం గురించి ప్రపంచానికి చాటి చెప్పుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, దాని ఉనికినే ప్రమాదంలో పడేసే చర్యలు మొదలుపెట్టింది. రామప్ప పక్కనే బొగ్గు ఓపెన్ కాస్టు మైనింగ్‌కు అనుమతులిస్తున్నది. భూపాలపల్లిలో ప్రస్తుతం ఉన్న బొగ్గు గనుల ప్రాజెక్టు విస్తరణలో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామప్ప ప్రాంతంలోనూ తవ్వకాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భూపాలపల్లిలో ప్రస్తుతం ఉన్న ఓపెన్ కాస్ట్ (కేటీకే 3) నుంచి 13.6 కిలో మీటర్ల దూరంలో వెంకటాపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును చేపట్టేందుకు సింగరేణి ఏర్పాట్లు చేస్తున్నది.
1,088 ఎకరాల విస్తీర్ణంలో 300 మీటర్ల లోతులో బొగ్గు తవ్వకాలు జరిపేలా సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును రూపొందించింది. ఇక్కడ తవ్విన బొగ్గును మరో 737 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ చేయనున్నారు. దీన్ని 120 మీటర్ల ఎత్తులో గుట్టలుగా పోస్తారు. ఇదే జరిగితే ఈ పచ్చని ప్రాంతమంతా కాలుష్యకాసారంగా మారుతుంది. అటవీ ప్రాంతమంతా నల్లటి బూడిద, పొగతో నిండిపోతుంది. సమీపంలోనే ఉన్న రామప్పను బొగ్గు, బూడిద, పొగ ముంచెత్తుతాయి. భక్తులు, పర్యాటకులతో కళకళలాడాల్సిన రామప్ప ప్రాంతం, మట్టికొట్టుకుపోయే ప్రమాదమున్నది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ కారణంగా ఇక్కడికి పర్యాటకులు రావాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని పురావస్తు నిపుణులు చెప్తున్నారు.
2016లో భూపాలపల్లి జిల్లా భీంగణపురం నుంచి రామప్ప వరకు దేవాదుల నీటిని తరలించేందుకు సొరంగం తవ్వాలని భావించారు. పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ చేయాల్సిన అవసరం ఉండటంతో రామప్ప ఆలయానికి ప్రమాదం ఉంటుందన్న కేంద్ర పురావస్తు శాఖ సూచన మేరకు అప్పటి ప్రభుత్వం పైపులైన్ నిర్మాణంతో దేవాదుల పనులు చేసింది. చారిత్రక కట్టడాల సమీపంలో మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ రామప్ప సమీపంలో మైనింగ్ కోసం రిపోర్టులను అనుకూలంగా తీర్చిదిద్దుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనల ప్రకారం రామప్ప కట్టడానికి మైనింగ్ ప్రాంతం ఎంత దూరం ఉండాలో అంతే ఉన్నట్టుగా నివేదికలను అధికార వర్గాలు చూపిస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. పాలంపేటకు ప్రత్యేక అభివృద్ధి అథారిటీ ఉన్నది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఈపీటీఆర్ఐ), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అనుమతులు వచ్చినట్టు సింగరేణి ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీటిని ఆధారంగా చూపి జిల్లా స్తాయిలోని మైనింగ్ కమిటీ ఆమోదం కోసం ఒత్తిడి తెస్తున్నారు. రామప్ప సమీపంలో మైనింగ్ అనుమతి కోసం ములుగు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే సమావేశం నిర్వహించారు. తర్వాత మీటింగ్‌లో తుదిదశ అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నదని తెలిసింది.
ప్రపంచవ్యాప్తంగా చారిత్రక కట్టడాల గుర్తింపుతోపాటు అవసరమైన మేరకు పరిరక్షణ చర్యలు చేపట్టపోతే ఆ గుర్తింపును రద్దు చేసేలా యునెస్కో నిబంధనలున్నాయి. రామప్ప ప్రాంతంలో మైనింగ్ జరిగితే భవిష్యత్తులో యునెస్కో తీవ్రమైన నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉన్నదని పురావస్తు నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రామప్ప ప్రాంతం ఇప్పు డు అడవిని తలపించేలా ఉంటుంది. ఈ ప్రాం తం లో బొగ్గు తవ్వకాలు మొదలైతే చెట్లు, పరిసరాలు, ఆలయ గోడలు దుబ్బ, మసిగొట్టుకుపోతా యి. పర్యాటకులకు బూడిద కుప్పలే దర్శనమిస్తాయి. ఇలాంటి పరిస్థితి వస్తే యునెస్కో మార్గదర్శాల ప్ర కారం రామప్ప ప్రాంతం ఉండదు. అప్పుడు రామప్పకు ఉన్న ప్రపంచ స్థాయి గుర్తింపునకే ప్రమాదం ఏర్పడుతుందని పురావస్తు నిపుణులు చెప్తున్నారు.
రామప్పకు గుర్తింపు విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. తెలంగాణ ఏర్పాటుతోనే రామప్పకు గుర్తింపు కోసం అడుగులు పడ్డాయి. ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం చేయాల్సిన పనులపై నిత్యం సంప్రదింపులు జరిపింది. కావాల్సిన నివేదికలను రూపొందిస్తూ వచ్చింది.
కేంద్ర పురావస్తు శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నివేదికలోని అంశాలతో యునెస్కో స్పందించింది. దీని అనుబంధ సంస్థ అయిన ఇంటర్నేషనల్ కౌన్సెల్ ఆన్ మాన్యుమెంట్ అండ్ సైట్స్ (ఐకోమాస్)తో రామప్పపై అధ్యయనం చేయించింది. వాసుపోశానందన నేతృత్వంలోని ఐకోమాస్ ప్రతినిధి బృందంతో 2019లో రామప్పను సందర్శించింది. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడానికి కావాల్సిన అన్ని అర్హతలున్నాయని కితాబునిచ్చారు. ఆ తర్వాత రామప్పకు యునెస్కో గుర్తింపు ప్రక్రియ వేగంగా కదిలింది. ప్రపంచ వారసత్వ నిర్మాణాల గుర్తింపుపై యునెస్కో సమావేశాలు 2020 ఫిబ్రవరిలో చైనాలో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి రామప్ప గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి నిత్యం విజ్ఞప్తులు వెళ్లాయి.
యునెస్కో గుర్తిం పు కోసం రామప్పను ప్రతిపాదించాలని 2021 జూన్ 23న రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, వీ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీలు, ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పాటిల్‌ను కోరారు. యునెస్కో సమావేశాలు చైనాలో 2021 జూలై 16 నుంచి మొదలయ్యాయి. వీటికి ముందు దేశం తరఫున ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించేందుకు ప్రతిపాదనలను యునెస్కో ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వం రామప్పను యునెస్కో గుర్తింపు కోసం నామినేట్ చేసింది. సమావేశాల్లో పాల్గొన్న దేశాల ఏకాభిప్రాయంతో రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కింది.
రాజస్థాన్‌లోని ప్రఖ్యాత చిత్తోడ్‌గఢ్ కోట దగ్గర లైమ్‌స్టోన్ మైనింగ్ విషయంలోనూ రామప్ప తర హా పరిస్థితి వచ్చింది. ఈ చారిత్రక కట్టడం విషయంలో రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కట్టడానికి 10 కిలో మీటర్ల పరిధిలో ఎలాంటి మైనింగ్ చే యవద్దని ఆదేశించింది. ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లడంతో కట్టడానికి ఐదు కిలో మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు వద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అది కోట కాగా ఇది ఆలయం.. పైగా వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తింపు పొందిన కట్ట డం.. ఒక కోటకు వర్తించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొం దిన చారిత్రక ఆలయానికి వర్తించవా? అన్న ప్రశ్న లు తలెత్తుతున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూసినా రామప్ప సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల తవ్వకంతో ప్రమాదం పొంచి ఉన్నది. అధికారులు ఉద్దేపూర్వకంగా మైనింగ్‌కు అనుగుణంగా దూరాన్ని రూపొందిస్తున్నారు. ఎయిర్ రూట్, రోడ్ రూట్లో వేర్వేరు దూరాన్ని నమోదు చేస్తున్నారు. మైనింగ్ ప్రాంతం నుంచి రామప్ప ఆలయం 4.5 కిలో మీటర్లే ఉన్నది. అనుమతుల కోసం అధికారు లు దీన్ని 5.5 కిలో మీటర్లుగా చూపిస్తున్నారు. అర కిలో మీటరును అనుకూలంగా చేసుకొని రామప్ప వద్ద విధ్వంసం చేసే పనులు చేపట్టడం ఎందుకని చరిత్రకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పేలుళ్లతో 5 కిలో మీటర్లదాకా ప్రభావం ఉంటుందని పరిశోధన సంస్థలు సైతం తేల్చిచెప్తున్నాయి.
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి వద్ద సేనాధిపతిగా పనిచేసిన రేచర్ల రద్రుడు 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. చారిత్రక సంపదలో కాకతీయులది ప్రత్యేక శైలి. వీరు నిర్మించిన ఆలయాల్లో ఎక్కువగా త్రికూటాలయాలే ఉన్నాయి. రామప్ప ఆలయాన్ని ఈ శైలిలోనే నిర్మించారు. ఇక్కడ రుద్రేశ్వర, కాటేశ్వర, కామేశ్వర స్వాములు కొలువై ఉంటారు. మూడు వైపులా ప్రవేశ ద్వారాలు, ఆలయం మధ్యలో పెద్ద మండపం ఉంటుంది. దేశంలోనే అరుదైన నిర్మాణ శైలి దీని సొంతం. రామప్ప ఆలయానికి వినియోగించిన రాళ్లు, ఇటుకలు ప్రత్యేకమైనవి. ఇటుకలు లేత ఎరుపు రంగులో ఉంటాయి. సాధారణ ఇటుకలతో పోల్చితే తక్కువ సాంద్రతతో వీటిని తయారు చేశారు. రామప్పకు ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయి. ఆలయం గోపురంపైన బరువు ఉండకుండా వీటిని వినియోగించారు.
ఏండ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేందుకు వీలుగా ఈ ఇటుకలతో కప్పు వేసేందుకు ప్రత్యేక మట్టితోపాటు ఏనుగు లద్దె, అడవి మొకల జిగురు, ఊకపొట్టు వంటి పదార్థాలతో చేసిన మిశ్రమాన్ని వినియోగించారు. ప్రత్యేకశైలిలో నిర్మించడం వల్లనే వందల ఏండ్లయినా రామప్ప ఆలయం కళా సంపద చెక్కు చెదరకుండా ఉన్నది. రాతి కట్టడం కావడంతో బరువు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తేలికగా ఉండే గ్రానైట్, డోలరైట్, బ్లాక్ గ్రానైట్లను వినియోగించారు.
డోలరైట్ రాయిపై ఉన్న శిల్పాలు రామప్ప ఆలయానికి ప్రత్యేక శోభను తెచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు లేని రోజుల్లోనే సన్నని దారం ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లేంత నైపుణ్యంతో ఇక్కడి శిల్పాలను చెక్కారు. ఇవీ అరుదైనవిగా కనిపిస్తాయి. భూకంపాలు, తుఫాన్లు, వరదలు వంటి విపత్తులకు చెక్కు చెదరకుండా ఇసుక పునాది (శాండ్ బాక్స్ టెక్నాలజీ)తో ఆలయాన్ని నిర్మించారు. 15 అడుగుల లోతులో ఇసుక నింపి అక్కడి నుంచి రాతితో పునాది నిర్మించారు. అందుకే వందల ఏండ్లయినా రాతి బరువుకు కిందికి కుంగిపోకుండా ఉంటున్నది. రామప్ప ఆలయంలో రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు.
రామప్ప ఆలయానికి సమీపంలో 40.43 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు సింగరేణి గుర్తించింది. రాష్ట్రంలోని గోదావరి తీరం వెంట విస్తారంగా బొగ్గు నిల్వలు ఉన్నా రామప్ప ఆలయం పక్కనే తవ్వకాలు జరిపేందుకు సర్వేలు పూర్తిచేసింది. ఇక్కడ ఏకధాటిగా 19 ఏండ్ల పాటు బొగ్గు తవ్వకాలు జరిపేందుకు అనుమతులు తీసుకుంటున్నది. 785 ఎకరాల అటవీ భూములు, 3,700 ఎకరాల వ్యవసాయ, ప్రభుత్వ అసైన్డ్భూములను సేకరించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రక్రియలో వినియోగించే పేలుడు వల్ల రామప్ప ఆలయ పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని నిపుణులు, చరిత్రకారుల్లో ఆందోళన వ్యక్తమవుత్నునది.
తెలంగాణకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చిన మహనీయుడు పీవీ నర్సింహారావు. ఆయన రామనందతీర్థ శిష్యుడు. వారసత్వ సంపద అయిన రామప్ప ఉన్న ప్రాంతంలో సాహిత్య, సాంస్కృతిక ఔన్యత్యానికి గుర్తింపుగా నిలిచిన పీవీ నర్సింహారావు పేరుతో సింగరేణి సంస్థ ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపడుతున్నది. పీవీ నర్సింహారావు ప్రతిష్ఠను పెంచేలా చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, చారిత్రక ప్రాంతంలో విధ్వంసం సృష్టించే ప్రాజెక్టుకు ఆయన పేరు పెడుతుండడంపై సాహిత్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీవీ పేరిట వారసత్వ సంపద విధ్వంసం జరిగే పనులు సరికాదని హితవుపలుకుతున్నారు.