మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు రోజురోజుకూ వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత నది, రాష్ర్టంలోని గోదావరి నదుల ద్వారా బరాజ్‌కు వరద పోటెత్తుతున్నది. బరాజ్ వద్ద వరద ప్రవాహాన్ని భారీ నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
16.17 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన లక్ష్మీబరాజ్‌లో శనివారం ఇన్‌ఫ్లో 20,260 క్యూసెక్కులు ఉండగా, బరాజ్ 8 బ్లాక్‌లో 85 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో ప్రవాహాన్ని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ రివర్ బెడ్ లెవల్ సముద్ర మట్టానికి 88 మీటర్లు కాగా, ప్రస్తుతం 89.30 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతున్నది. ప్రసుత్తం బరాజ్ రివర్ బెడ్ నుంచి వెళ్తున్న ప్రవాహం 1.30 మీటర్ల ఎత్తులో ఉన్నది.
తెలంగాణ భవన్లో జగ్జీవన్‌రామ్‌కు నివాళి
హైదరాబాద్ : భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతిని శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ చిత్రపటానికి నివాళి అర్పించి, దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్‌రెడ్డి, అభిలాషరావు పాల్గొన్నారు.
భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం
వరంగల్ : ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అర్చకులు సహస్ర కలశాభిషేకంతోపాటు పూజలు చేశారు. కామేశ్వరీ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా, భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
పాపహరేశ్వరాలయంలో జలాభిషేకం
పెద్ద కొడప్గల్ : వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకుంటూ కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ వాసులు శనివారం స్థానిక పాపహరేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీపరమేశ్వరులకు అభిషేకాలు నిర్వహించారు. పంటలు కాపాడాలంటూ భజనలు చేశారు. అనంతరం గర్భగుడిలోని శివలింగం, పార్వతీ పరమేశ్వర మూర్తులు పూర్తిగా మునిగే వరకు నీళ్లు పోశారు.