హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అనుకున్నదే జరిగింది. బాయికాడ మీటర్ పెట్టుడు ఖాయమని తేలిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేరుగా రైతులతోనే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మొదట్నుంచీ పడుతున్న ఆందోళన నిజమేనని స్పష్టమైంది. ఆదివారం రాష్ర్టానికి వచ్చిన అమిత్‌షాతో ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతుసంఘం భారతీయ కిసాన్‌సంఘ్ నేతల భేటీ జరిగింది. ఈ భేటీలో ఏదో సేంద్రియ వ్యవసాయం గు రించి ఉపన్యాసం చెప్పి పోదామనుకున్న షాకు అనూహ్యంగా మీటర్ల సెగ తగిలింది. మోటర్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారంటూ ప్రశ్నించారు. మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్తును నిలిపేస్తారా? విద్యుత్తు చట్ట సవరణపై వెనక్కు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిణామంతో అమిత్ షాతోపాటు అక్కడున్న బీజేపీ నేతలంతా ఒక్కసారిగా కంగు తిన్నారు. వెంటనే తేరుకొన్న పలువురు నేతలు రైతులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
మీటర్ల గురించి మాట్లాడొద్దని కట్టడి చేశారు. ఊహించని ఈ ప్రశ్నలతో ఏం జవాబు చెప్పాలో తెలియక కొంత అయోమయానికి గురైన షా.. ఆ తరువాత మీటర్లు పెట్టడం ఖాయమని స్పష్టంచేశారు. మీటర్ల నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనే ప్రసక్తే లేదన్నారు. తాము బాయికాడ మోటర్లకు మీటర్ల గురించి మాట్లాడుతుంటే.. వాటి గురించి మాట్లాడొద్దని అమిత్ షా చెప్పారని రైతులు అసహనానికి గురయ్యారు. సమావేశం అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్తు చట్టం గురించి మీకెందుకు.. మీరు సేంద్రియ వ్యవసాయం గురించి మాట్లాడండి.. ఎగుమతులు, దిగుమతుల గురించి మాట్లాడండి.. మద్దతు ధర గురించి మాట్లాడండి.. ఈ చట్ట సవరణ గురించి మాట్లాడొద్దని షా ఆగ్రహం వ్యక్తంచేసినట్టు పేర్కొన్నారు. మీటర్ల నిర్ణయాన్ని మార్చాలని తాము కోరుతుంటే.. ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పారని రైతుసంఘం నేతలు అసహనం వ్యక్తంచేశారు. రైతుల సమస్యల గురించి చెప్పనివ్వకుండా వారికి కావాల్సిన అంశాలనే అడిగి తెలుసుకోవడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. పీఎం కిసాన్ కింద కేంద్ర ఇస్తున్న సహాయాన్ని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని అమిత్ షాను రైతులు కోరితే జవాబివ్వకుండా తప్పించుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు రూపంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎంత భూమి ఉంటే అంత భూమికి ప్రతియేట ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
బాయిలకాడ మోటర్లకు మీటర్లు పెట్టడంపై కొంత కాలంగా సీఎం కేసీఆర్ పడుతున్న ఆందోళన నిజమైంది. రాష్ర్టానికి వచ్చిన అమి త్ షా మోటర్లు పెట్టడంపై తేల్చి చెప్పారు. రైతు లు అడిగిన ప్రశ్నలను ఖండించకుండా, దాని గురించి మాట్లాడొద్దంటూ చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణలో రైతుల మోటర్లకు మీటర్లు పెట్టడం ఖాయమని తేలిపోయింది. శనివారం మునుగోడులో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టానికి వస్తు న్న అమిత్ షాను మీటర్ల అంశంపై నిలదీయాలని రైతులకు సూచించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ మాట ప్రకారం రైతులు అమిత్ షాను నిలదీసి కడిగేయడం గమనార్హం. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ సర్కారు మోటర్ల కాడ మీటర్లు పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది మన పొరుగు రాష్ట్రం ఏపీలో అమల్లోకి వచ్చింది. బాయిలకాడ మోటర్లకు మీట ర్లు బిగిస్తున్నారు. ఇదే జరిగితే భవిష్యత్‌లో సీఎం కేసీఆర్ ఎన్నో కష్టాలకోర్చి రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు కేం ద్రంలోని బీజేపీ సర్కారు చరమగీతం పాడే ప్రమాదం ఉన్నది. ఉచితాలను నిలిపేయాలంటూ చెప్పుకొస్తున్న బీజేపీ ఉచిత విద్యుత్తును నిలిపేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే రైతులు మళ్లీ పాత రోజులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
రెండేండ్ల క్రి తం నా బిడ్డకు బ్రె యిన్‌లో గడ్డ ఏర్పడింది. ఆపరేషన్ కు 5 లక్షలు అవుతదన్నారు. సా యం చేస్తారని అప్పటి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వద్దకు వెళ్లా. అయినా కనికరించలేదు. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తాడో చూద్దామనే సభకు వచ్చా.
-శిర్గమల్ల వెంకన్న, చీకటిమామిడి, మునుగోడు(మం)
బీజేపీ వాళ్లు డ బ్బులిస్తేనే సభకు వచ్చాం. ఆ పార్టీ పై మాకు అభిమా నం లేదు. మా బి డ్డ పెండ్లికి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి కింద 1,00,116 ఇచ్చారు. పేద తండ్రికి భరోసా ఇస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికే మా మద్దతు.
– గుర్రం యాదయ్య, ఎల్గలగూడెం, మునుగోడు మండలం