నిజామాబాద్, డిసెంబర్ 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉత్తర తెలంగాణలో పెద్ద పులుల అలజడి క్రమంగా పెరుగుతున్నది. మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులు దక్షిణం వైపు పరుగులు తీస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కవ్వాల్ అభయారణ్యానికి పరిమితమైన పెద్ద పులులు క్ర మంగా నిజామాబాద్, కామారెడ్డి అడవుల్లోకి చొచ్చుకొస్తున్నాయి. ఆహారం, ఆడ పు లుల సావాసం కోసం పయనమవుతున్నా యి. ఆరు నెలల్లో రెండు పెద్ద పులులు వల స వచ్చాయి. అందులో ఒకటి ఎస్ 12 పేరు కలిగిన పెద్దపులి కాగా, మరొకటి మూడేండ్ల వయసు కలిగిన పులి. ఇది ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో తిరుగుతున్నది. ఆసిఫాబాద్ అ డవుల్లో మనుషులపై దాడిచేసిన ఎస్12 పులి జాడ ఎక్కడో తెలియడంలేదు. అటవీశాఖ అధికారులు స్పష్టతనివ్వడంలేదు.
జూలైలో ఎస్ 12 అనే ఐదేండ్ల మగపులి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అడవుల నుంచి గోదావరి నది దాటి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల మీదుగా కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. పులి వచ్చినట్టు పాదముద్రల ఆధారంగా గుర్తించిన అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఇంతలో జూలై 14న పులి లేగదూడను చంపి తిన్నది. ఆ తర్వాత పులి ఏమైందో తెలియలేదు. లేగదూడ యజమాని ఆవు కళేబరంపై పురుగుమందు చల్లిపెట్టాడని, ఆ మాంసం తినడంతో పులి చనిపోయిందని ప్రచారం జరుగుతున్నది. పులి వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోయిందని కొందరు అంటున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం ఎస్ 12 పులి మిస్సింగ్ అని ఆగస్టులో ప్రకటించారు. పులి సంచారం గురించి తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయని అటవీశాఖ, ఇప్పుడు పులి ఏమైపోయిందో చెప్పడంలేదు.
కామారెడ్డి అడవుల్లో ఎస్ 12 పులి గల్లంతైన నేపథ్యంలో డిసెంబర్ 14న మరో మగ పులి జాడను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దోమకొండ మండలం అంబారిపేట శివారులో పంట పొలాల వద్ద పులి పాదముద్రలను కనుగొన్నారు. సోమ, మంగళవారాల్లో నాలుగైదు పశువులను పులి వేటాడింది. ఎస్ 12 పులికి, తాజాగా సంచరిస్తున్న పులికి పోలికలు లేవని అధికారులు తేల్చారు. మూడేండ్ల వయసు కలిగిన ఈ మగ పులిని నవంబర్ చివరి వారంలో జన్నారం దగ్గర ఇంధన్నపల్లి వద్ద గుర్తించామని చెప్తున్నారు.
ఇది దట్టమైన అటవీ ప్రాంతాల మీదుగా కాకుండా పొలాల మీదుగా తిరుగుతున్నట్టు చెప్తున్నారు. పులులు వచ్చినప్పుడు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పులులను చంపడం కళేబరాలను తరలించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కానీ అటవీశాఖ అధికారులు ప్రజలకు రక్షణ కల్పించడంలో, పులులను సంరక్షించడంలో విఫలమవుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కామారెడ్డిలో జూలై నెలలో కనిపించిన పెద్ద పులికి, మూడు రోజుల క్రితం అంబారిపేటలో కనిపించిన పులికి ఎలాంటి సంబంధం లేదు. ఇవి రెండు వేర్వేరు పులులు. ఎస్12 పులి జాడ దొరకడం లేదు. వచ్చిన దారుల్లోనే వెనక్కి వెళ్లిందని భావిస్తున్నాం. చనిపోయిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు.
– బోగ నిఖిత, అటవీశాఖ కామారెడ్డి జిల్లా అధికారి