హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆమె ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాదాయశాఖ ఆధీనంలోని భూముల వివరాలను సేకరించాలని, అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, కబ్జాలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.
వేసవి తీవ్రత దృష్ట్యా దేవాలయాల్లో భక్తులకు మౌలిక సదుపాయాలు, గ్రీన్ మ్యాట్స్, కార్పెట్స్, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఎండోమెంట్ కమిషనర్, సమాచార పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావుతోపాటు పలువురు అడిషనల్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ప్రధాన దేవాలయాల కార్యనిర్వాహక అధికారులు పాల్గొన్నారు.