కొండమల్లేపల్లి, అగస్టు 23 : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటన అత్యంత దారుణమని, విద్యాబుద్ధులు నేర్పిన గురువును అతి దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఆదివారం రూపారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి, ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పిల్లలను పాఠశాలల్లో దండించక, తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఎలా తయారవుతారో చెప్పడానికి కొండమల్లేపల్లి ఘటన నిదర్శనమని చెప్పారు. పాఠశాల స్థాయిలో దండించకపోతే రేపు పిల్లలు కటకటాల్లో శిక్షించబడుతారన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని తెలిపారు.