జగిత్యాల కలెక్టరేట్, మార్చి 1: కొండగట్టు దేవస్థానంలో ఆంజనేయ స్వామికి చెందిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాలలో బుధవారం కేసు వివరాలను ఎస్పీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన బాలాజీ కేశవ రాథోడ్, రామారావు జాదవ్, రాంశెట్టి జాదవ్, విక్రం జాదవ్, నర్సింగ్ జాదవ్, శక్తిజాదవ్, విజయ్‌కుమార్ రాథోడ్ అందరు దగ్గరి సంబంధీకులు. వీరు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో వెండి నగలు, వస్తువులను ఎత్తుకెళ్ల్లి నగదుగా మార్చుకుని జీవిస్తున్నారు. కొండగట్టు ఆలయంపై కన్నేసిన ఈ ముఠా గత ఫిబ్రవరి 22న బైక్‌లపై బీదర్ నుంచి కొండగట్టుకు చేరుకున్నారు.
ఏ1)బాలాజీ కేశవ రాథోడ్, ఏ2) రామారావు జాదవ్, ఏ3)రాంశెట్టి జాదవ్, ఏ4) విక్రం రాథోడ్ అంజన్న భక్తుల మాదిరి కాషాయం దుస్తులు ధరించి రాత్రి అక్కడే నిద్రపోయారు. 23న అర్ధరాత్రి ఆలయం వెనుక ద్వారాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆలయంలోని మకరతోరణం, కిరీటం, రెండు శఠగోపాలు, ఆంజనేయ స్వామి ప్రతిమ, వెండి కిరీటం, వెండి గొడుగు, వెండి పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు చెందిన కవచాలను ఎత్తుకెళ్లారు. బాలాజీజాదవ్, నర్సింగ్ జాదవ్, విజయ్‌కుమార్ రాథోడ్‌ను అరెస్టు చేసి వారి నుంచి రూ. 3.50 లక్షల విలువైన ఐదు కిలోల వెండి వస్తువులు శఠగోపం, పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు సంబంధించిన కవచాలు, ఒక మోటర్ సైకిల్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.