Cyber Crime | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): న్యూడ్ వీడియో కాల్స్‌తో హైదరాబాద్‌లోని చంపాపేటకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన యువతి వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. న్యూడ్ వీడియో కాల్స్ చేసి డబ్బులు వసూలు చేయడం వాస్తవమే అయినా.. అవి నిజమైన వీడియో కాల్స్ కాదని తెలంగాణ సైబర్ పోలీసులు తేల్చారు. ఆ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి ముందే రికార్డు చేసిన న్యూడ్ వీడియోను చూపారని, అదే సమయంలో వేరే మహిళతో వాయిస్ ఓవర్ ద్వారా అతడిని కవ్వించి ఆ బాగోతాన్నంతా రికార్డు చేశారని, ఆ తర్వాత ఆ వీడియోను అందరికీ పంపుతామంటూ ఆ ఉద్యోగిని బెదిరించి డబ్బులు గుంజారని నిర్ధారించారు. రాష్ట్రంలో అక్కడక్కడా ఇలాంటి కేసులు నమోదయ్యాయని, వాటికి సంబంధించిన అన్ని వీడియోల్లో ఒకే యువతి కనిపించడం, ఎక్కడా లిప్ సింక్ కాకపోవడంతో అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు.
అశ్లీల (పోర్న్) వీడియోలను చూసే అలవాటున్నవారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతతో ఈ దందాకు పాల్పడుతున్నారని, ఇలాంటి మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ హెచ్చరించారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించకూడదని, అలాంటి వీడియో కాల్స్‌కు భయపడి ఎవరికీ డబ్బులు పంపవద్దని సూచించారు. సైబర్ నేరాల బారిన పడి ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే పోలీసులను లేదా 1930 ఫోన్ నంబర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని తెలిపారు.