శక్కర్‌నగర్, ఆగస్టు 19 : అనుమానాస్పదంగా కనిపించిన ఓ కపోతం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానీపేట్‌లో కలకలం రేపింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ పావురం గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో రెండు రోజుల క్రితం పడిపోయింది. ఇంటి యజమానులు దానికి సపర్యలు చేసి కాపాడారు. కపోతం కాళ్లకు రింగులు ఉండటం, వాటిపై గుర్తు తెలియని భాషలో అక్షరాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
వారు ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం గ్రామస్థులకు చెప్పడంతో వారు పావురాన్ని పరిశీలించారు. కాళ్లకు రింగులు, వాటిపై అక్షరాలు ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. రూరల్ పోలీసులు భవానీపేట్కు చేరుకుని పావురాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొన్నిచోట్ల పావురాల పోటీలు నిర్వహిస్తుంటారని, ఈ క్రమంలో అది తప్పిపోయి ఇటు వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. కాళ్లకు ఉన్న రింగులు, వాటిపై ఉన్న అక్షరాలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.