ఖమ్మం, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభపై ఆంధ్రావాసులు దృష్టిసారించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత ఆంధ్రాలోనూ పార్టీ శాఖ ఏర్పడింది. దేశం దృష్టిని ఆకర్షించేలా జరిగే ఈ సభకు వచ్చేందుకు ఏపీ ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరిహద్దు ప్రాంతాల్లోని ఏపీ ప్రజలు స్వచ్ఛందంగా సభకు రావడానికి సిద్ధమవుతున్నారు. సభా సమయం, పార్కింగ్ ప్రదేశాల వంటి అంశాలను జిల్లా పార్టీ నేతల నుంచి తెలుసుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తోపాటు అక్కడి జిల్లాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు రానున్నట్టు తెలిసింది. ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాలైన ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లాలోని గుడివాడ, ఉయ్యూరు, విజయవాడ, కంకిపాడు, పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, ఏలూరు, చింతలపూడి, విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, వీఆర్‌పురం వంటి ప్రాంతాల నుంచి భారీ ఎత్తున పయనమై సీఎం కేసీఆర్ సందేశాన్ని వినేందుకు తరలిరానున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చుకొంటున్నారు. ఏపీ నుంచి వచ్చే వారి కోసం సభా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 18న నిర్వహించే బహిరంగ సభకు బీసీ, ఎంబీసీ సంచార జాతుల వారు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశానికి కొత్త వెలుగురేఖ అని అభివర్ణించారు. ఆర్థిక, మహిళా, సాధికారత, నూతన రైతు విధానాలకు బీఆర్ఎస్ కొత్త నాంది పలికిందని తెలిపారు. సీఎం కేసీఆర్ బడుగు బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తూ దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు.