హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖలో పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఏడీ, డీడీలకు పదోన్నతులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 18మంది డీడీలకు జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై నేడురేపో ఉత్తర్వులతోపాటు, పోస్టింగ్ ఇచ్చే అవకాశమున్నది.
ఇందులో తొమ్మిది జేడీ పోస్టులు రెగ్యులర్ ఉండగా, మరో తొమ్మిది ఆత్మ పీడీ పోస్టులను క్రియేట్ చేసినట్టుగా సమాచారం. ఏడీస్థాయి నుంచి డీడీగా పదోన్నతుల్లో కొంత గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తున్నది. అర్హులు అధికంగా ఉండడం, పోస్టులు తక్కువగా ఉండడంతో ఏం చేయాలనేదానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు.
ప్రస్తుతం 21డీడీ పోస్టులు ఖాళీగా ఉండగా, ఆత్మలో మరో 20డీపీడీ పోస్టులు క్రియేట్ చేసి పదోన్నతులు కల్పించాలని భావిస్తున్నారు. అయితే ఏడీ నుంచి డీడీలుగా ఎంతమందికి పదోన్నతులు కల్పిస్తారనేదానిపై స్పష్టత లేదు. వ్యవసాయశాఖలో పదోన్నతులపై రెండు అసోసియేషన్ల మధ్య కొ న్నేండ్లుగా వివాదం నెలకొన్న విషయం విధితమే.
ఈ నేపథ్యంలో రెండు అసోసియేషన్లకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలోభాగంగానే పలువురు అధికారులకు పదోన్నతులు కల్పించేందుకు పోస్టులు క్రియేట్ చేస్తున్నారు. కాగా, ప్రమోషన్లు పొందిన వాళ్లు మళ్లీ పాతస్థానాల్లోనే కొనసాగేలా, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి.