Congress Party | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటిపోరు బజారుకెక్కుతున్నది. పార్టీలో, ప్రభుత్వంలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పరంపరను మొదలుపెట్టారు. ఈసారి గతానికి భిన్నంగా మీడియాలో లీకులు ఇస్తున్నారు. దీనికి సాక్షాత్తు ప్రభుత్వ పెద్దనే తెరతీశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తనకు నచ్చని మంత్రులపై తనకు అనుకూలంగా ఉండే ఓ పత్రికలో పనిగట్టుకొని వార్తలు రాయిస్తున్నట్టు పార్టీ నాయకులు కొందరు వాపోతున్నారు. అసలే ప్యారాచూట్ నేత.. ఆపై పెద్ద పదవిలోకి వచ్చాడు. తన స్థానాన్ని కాపాడుకోవాలంటే తనకు పోటీగా ఉన్నవారిని బద్నాం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ పత్రికలో మంత్రివర్గంలోని ఓ సీనియర్ మంత్రిపై కథనం వెలువడింది. ఆయన గత ప్రభుత్వ చర్యలను సమర్థించేలా వ్యవహరిస్తున్నాడని, ముఖ్యమంత్రి ఆయన తీరుతో విభేదిస్తున్నారన్నది ఆ కథనం సారాంశం.
ఆ కథనాన్ని చూస్తే ఓ సీనియర్ మంత్రి తప్పుచేస్తున్నారన్న అర్థం స్ఫూరించేలా ఉన్నది. దీనిపై సదరు మంత్రి అగ్గిమీద గుగ్గిలంలా అయ్యారు. ఇదేం రాతలంటూ సదరు పత్రిక అధిపతికి ఫోన్ చేయడమే కాకుండా.. దీన్ని ఎవరు రాయించారో తనకు తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వ పెద్ద కార్యాలయం నుంచి నడిపించిన తంతంగం ఇదంతా అని ఆయన తన అనుచరులతో వ్యాఖ్యానించినట్టు సహచర వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని ఆయన పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్‌ల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెల్సింది. సీనియర్‌గా ఉన్న తనపైనే బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదని, ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆయన వారితో చెప్పినట్టు సమాచారం.
ఈ వివాదం ఇలా సాగుతుండగా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల రైతుబంధుపై చేసిన వ్యాఖ్యలను ఇంగ్లిషు, హిందీ భాషల్లోకి తర్జుమా చేసి పార్టీ హైకమాండ్‌కు పంపినట్టు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సైతం జోడించి మరీ ఈసారి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయించినట్టు సమాచారం. దీని వెనుక కూడా ఒక పెద్దాయన ఉన్నారని, ఆయన తన సోషల్ మీడియా, బలగాన్ని ఉపయోగించి ఇలా చేయిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ విషయం తెలిసిన వెంకట్‌రెడ్డి గురువారం ఢిల్లీలో పలువురు పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, తానేమీ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిచేయడంలేదని వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది. గతంలో కూడా పార్టీలోని ఒకవర్గం తాను పార్టీ నుంచే వెళ్లిపోతున్నట్టు ప్రచారం చేయించిందని ఆయన గుర్తు చేశారు. తాను నిజమైన కాంగ్రెస్ వాదినని, యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీలో ఉన్నవ్యక్తినని, పార్టీలు మారుతూ వచ్చినవాడిని కాదని ఆయన స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.