హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆఫీస్ బేరర్స్ సమావేశం గరంగరంగా సాగింది. పార్టీలో సమన్వయలోపంపై అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఒక్కచోట కూర్చొని మాట్లాడే పరిస్థితిలేదని మండిపడ్డారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్ణయించిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలుకావడంలేదని పెదవి విరిచారు. పరిస్థితి మారకుంటే స్థానిక ఎన్నికల్లో నిండా మునగడం ఖాయమని హెచ్చరించారు. కొందరు నేతలైతే ఏకంగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కడిగిపారేశారు. బహిరంగ సభల నిర్వాహణ బాధ్యతలను పార్టీ ఇన్‌చార్జీలకు కాకుండా ఇతర నేతలకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య ఎంతమాత్రం సఖ్యతలేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు కలిసి కూర్చొలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. గ్రౌండ్లెవల్లో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘పార్టీలో ఇంత గందరగోళం ఉంటే లోకల్‌బాడీ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు? అసలు రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తున్నది? సమావేశాలకు వచ్చుడు.. పోవుడే తమ పనా?’ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఆయన మాటలతో రాష్ట్రస్థాయి నాయకులు అవాక్కయ్యారు.
బీజేపీ నాయకుల వైఖరిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఫైర్ అయ్యారు. సమస్యలను అధిగమించి ముందుకెళ్దామని చెప్పుకొచ్చారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పరిస్థితులపై కమిటీ వేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యాడర్‌ను కలుపుకొని వెళ్లాలని నిర్దేశించారు. రెండు, మూడురోజుల్లో లోకల్‌బాడీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో పార్టీలో గందరగోళం నెలకొనడంపై రాష్ట్ర నాయకత్వం అసహనం వ్యక్తంచేసిందివ్యక్తంచేసింది.