ఖైరతాబాద్, ఏప్రిల్ 13: సింగర్ సత్యవతి ముడావత్ అలియాస్ మంగ్లీ కేసు నేపథ్యంలో పంజాగుట్ట ఠాణాలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. సోమవారం బాధితులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన న్యాయవాది సుబ్బారావుకు, పోలీసులకు మధ్య హైడ్రామా నడిచింది. సుబ్బారావు మద్యం సేవించి స్టేషన్‌కు వచ్చారని, ఆయనకు ఆల్కహాల్ టెస్టు చేయాలని ఇన్స్పెక్టర్ రామకృష్ణ అనడంతో, తాను ఎలాంటి మద్యం తీసుకోలేదని సుబ్బారావు చెప్పారు. ఆయన వెంట వచ్చిన వారు పరీక్షకు ససేమిరా అనడంతో పోలీసులు, న్యాయవాదితో కలిసి వచ్చిన వారి మధ్య వాగ్వాదం జరిగింది.
మద్యం వాసన వస్తున్నదని, ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించక తప్పదని సీఐ రామకృష్ణ చెప్పడంతో అందుకు అంగీకరించిన సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, 27 మిల్లీ గ్రాముల శాతం నిర్ధారణ జరిగింది. దీనిపై సీఐ మాట్లాడుతూ.. వాహన డ్రైవింగ్‌కు ఇది పరిమితి లోపలే ఉన్నప్పటికీ, జనావాసాలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఆ శాతం కూడా ఆక్షేపణీయమని స్పష్టంచేశారు. తాను బాధితుల తరఫున న్యాయం చేసేందుకు వచ్చానని, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మీడియా సమావేశంలో సుబ్బారావు ఆరోపించారు. మంగ్లీ కేసు విషయంలో బాధితులంతా తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తుంటే పోలీసులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఫైనాన్స్ స్కామ్‌కు సంబంధించిన ఫిర్యాదులేవీ తమకు అందలేదని ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. బాధితులకు సంబంధించిన కేసులతో సైతం ఈ పీఎస్‌కు సం బంధం లేదని, సుబ్బారావు ఇచ్చిన ఫిర్యా దు కేవలం మంగ్లీ తనను బెదిరించారనే అంశంపైనే ఉన్నదని, ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నామని, మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదు కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మైక్రోఫైనాన్స్‌లో అధిక లాభాలు ఇప్పిస్తానని మధు చెప్పడంతో నమ్మామని, మంగ్లీ పేరు చెప్పడంతోనే పెట్టుబడులు పెట్టామని బాధితులు నునావత్ నితిన్, రవితేజ, శివ తదితరులు తెలిపారు.