వనపర్తి టౌన్, సెప్టెంబర్ 9 : గురుకుల భవనానికి అద్దె(Rent) చెల్లించడం లేదని యజమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం వనపర్తి(Wanaparthi) జిల్లా నాగవరం వద్ద ప్రైవేటు భవనంలో పెద్దమందడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(Gurukula school), డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు. పాఠశాలలో 618 మంది, డిగ్రీ కాలేజీలో 400 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. కాగా, పాఠశాల భవనానికి నెలకు రూ.3 లక్షలు (8 నెలలకు రూ.24 లక్షలు), కళాళాల భవనానికి నెలకు రూ.4,50,601 (8 నెలలకు రూ.36,04,808) చొప్పున పెద్ద మొత్తంలో అద్దె చెల్లించాల్సి ఉంది.
దీంతో బకాయిలు మొత్తం వెంటనే చెల్లించాలని భవనం ప్రధాన గేటుకు తాళం వేశాడు. దీంతో విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు అక్కడే నిరీక్షించారు. యజమానితో ఉన్నతాధికారులు ఫోన్లో మాట్లాడి త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం తర్వాత గేటుకు తాళం తీశాడు.