Gurukula School | ఎర్రవల్లి చౌరస్తా, సెప్టెంబర్ 30: గురుకుల పాఠశాల భవనానికి 10 నెలలుగా అద్దె చెల్లించడం లేదని యజమాని సోమవారం పాఠశాలకు తాళం వేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. అయిజ మండలానికి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మంజూరు కాగా.. అక్కడ సౌకర్యాలు లేవని అధికారులు ఎర్రవల్లి మండల కేంద్రంలోని ఎంజీ కృష్ణకు చెందిన భవనంలో స్కూల్‌ను నడుపుతున్నారు. నెలకు రూ.2 లక్షల చొప్పున 10 నెలలకు రూ.20 లక్షల వరకు అద్దె డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ విషయమై పాఠశాల సిబ్బందిని యజమాని ఎన్నిసార్లు అడిగినా ఈరోజు, రేపు అంటూ దాటవేస్తూ వచ్చారు. దీంతో ఆగ్రహించిన యజమాని సోమవారం ఉపాధ్యాయులు పాఠశాల లోపలికి వెళ్లకుండా గేటుకు తాళం వేశాడు. ఈ విషయం తెలుసుకున్న జోనల్ ఆఫీసర్ రజని స్పందించి ఓనర్‌తో మాట్లాడి రెండ్రోజుల్లో డబ్బులు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో కృష్ణ గేటుకు తాళం తీశాడు. అలాగే విద్యార్థుల హాస్టల్ భవన నిర్మాణానికి సంబంధించి రూ.30 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని యజమాని కృష్ణ వాపోయాడు.