కోదాడ, ఆగస్టు 28 : గత 30 సంవత్సరాలుగా జీవనాధారంగా ఉన్న డబ్బా కొట్టును మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా అక్రమంగా తొలగించగా.. శాంతియుతంగా నిరసన చేస్తున్న బాధితులపై, తన దాష్టీకాన్ని చూపించారు పట్టణ సీఐ. మహిళలు అని కూడా కనికరం లేకుండా విచక్షణారహితంగా చేతులతో నెట్టి, కాళ్లతో తన్ని ఖాకీ జులుం ప్రదర్శించిన వైనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది.
కోదాడ పట్టణంలోని యాదవనగర్‌లో బీఆర్ఎస్ వార్డు ఇన్చార్జి మాధవ ఉపేందర్ అక్క గంధం కనకమ్మ గత 30 సంవత్సరాల క్రితమే డబ్బా కొట్టు ఏర్పాటు చేసుకొని తన ఇద్దరు ఆడపిల్లలతో జీవనం కొనసాగిస్తున్నది. భర్త లేని ఆమె రోజు వచ్చే డబ్బులతో బతుకు ఈడుస్తున్నది. మంత్రి, ఎమ్మెల్యే దంపతులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో మాదల ఉపేందర్ పోస్టులు పెట్టి, వారి ప్రతిష్ట దిగజారుస్తున్నాడని స్థానిక కాంగ్రెస్ నాయకులు గురువారం పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న ఉపేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని హుటాహుటిన కోదాడకు తీసుకువచ్చి గురువారం రాత్రి 11 గంటల వరకు విచారణ చేపట్టారు.
సదరు పోస్టుల్లోని అంశాలపై ఆధారాలు చూపాలని పోలీసులు నిలదీయడంతో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు మాత్రమే పార్వార్డ్ చేశానని ఉపేందర్ సమాధానం ఇచ్చాడు. అయినా పట్టించుకోకుండా ఉపేందర్‌పై పోలీసులు కేసునమోదుచేసి నోటీసులు ఇచ్చి న్యాయవాదుల సమక్షంలో వదిలిపెట్టారు. అంతటితో ఆగకుండా ఉపేందర్ అక్క గంధం కనకమ్మ డబ్బాకొట్టును తెల్లారేకల్లా తొలగించి, చెరువు పక్కన వేయించారు. ఈ తంతు అంతా కాంగ్రెస్ నేతల ఒత్తిడితోనే జరుగుతున్నదని ఉపేందర్ ఆరోపించారు.
తమ జీవనాధారమైన డబ్బా కొట్టును తెలారే కల్లా తొలగించారని ఇందుకు మున్సిపల్ కమిషనరే బాధ్యులని, తక్షణమే డబ్బా కొట్టును తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ కోదాడ ప్రధాన రహదారిపై శుక్రవారం బాధితురాలు గంధం కనకమ్మ, ఆమె కూతుళ్లు, తమ్ముడు ఉపేందర్‌తో పాటు బంధువులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. దీంతో గంటసేపు ట్రాఫిక్ జామ్ కాగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు చేరుకొని సమస్య పరిష్కారానికి మున్సిపల్ కార్యాలయాలనికి వెళ్లాలని చెప్పినప్పటికీ బాధితులు కమిషనర్ తక్షణమే వచ్చి హామీ ఇస్తే నిరసన విరమిస్తామని భీష్మించారు.
ఈక్రమంలో పట్టణ సీఐ శివశంకర్‌నాయక్ ధర్నా వద్దకు చేరుకుని ఉపేందర్‌ను మెడపట్టి కిందికినెట్టి ఈడ్చుకువెళ్లి పోలీసు వాహనంలో తోశాడు. అడ్డువచ్చిన మహిళలను చేతులతో నెట్టుతూ, కాళ్లతో తన్నాడు. కవరేజ్ కోసం వచ్చిన చింతలపాలెం జర్నలిస్టు సురేశ్‌ను సైతం సీఐ నెట్టివేశాడు. కాగా ఈ వ్యవహారం అంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోదాడ పట్టణంలో నిరసన తెలుపుతున్న బాధితుల వార్తను కవరేజ్ చేస్తున్న జర్నలిస్టు సురేశ్‌పై పట్టణ సీఐ దురుసుగా ప్రవర్తించడాన్ని టీయూడబ్ల్యూజే -143 జిల్లా అధ్యక్షుడు వడ్డె వీరయ్యతో పాటు కోదాడ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్న నన్ను మంత్రి, ఎమ్మెల్యేపై అనుచిత పోస్టులు పెట్టానని ఆరోపిస్తూ పోలీసులు తీసుకువచ్చి కోదాడ పోలీసుస్టేషన్లో కేసులు పెట్టడం బాధాకరం. సామాజిక మాధ్యమంలో వచ్చిన పోస్టులు మాత్రమే నేను ఫార్వర్డ్ చేశాను. నాపై కక్ష కట్టి మా అక్క డబ్బా కొట్టును తొలగించడం సమజసం కాదు. నాకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యేదే బాధ్యత. -మాదల ఉపేందర్
గత 30 సంవత్సరాలుగా భర్త లేని నేను డబ్బాకొట్టు పెట్టుకొని పిల్లలతోపాటు పొట్ట పోసుకుంటున్నా. ఈ డబ్బాకొట్టు వల్ల ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందిలేదు. మా వార్డు కౌన్సిలర్ మున్సిపాలిటీ స్థలంలోనే నిబంధనలకు విరుద్ధంగా పెద్ద డబ్బాకొట్టును వేసుకుంటే అధికారులు పట్టించుకోకుండా నాపై కక్ష కట్టి ఎటువంటి సమాచారం లేకుండా డబ్బాకొట్టు తొలగించారు. మున్సిపల్ అధికారులు న్యాయం చేసేదాకా ఆందోళన చేస్తా.
– గంధం కనకమ్మ, డబ్బాకొట్టు యజమాని
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బాధితులపై కక్షకట్టి విచక్షణారహితంగా దాడి చేసిన పట్టణ సీఐని తక్షణమే విధుల నుంచి తొలగించాలి. మహిళలు అనే కనికరం లేకుండా ప్రవర్తించడం దుర్మార్గం. రెండు సంవత్సరాలుగా అధికార పార్టీ నేతలతో ప్రజలను ఇబ్బంది పెడుతూ.. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న పట్టణ సీఐని వెంటనే తొలగించాలి.
– బొల్లం మల్లయ్యయాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే