సనత్‌నగర్ టిమ్స్ దవాఖాన సందర్శనకు తరలిన బీఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ సర్కారు అడ్డుకున్నది. ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపుతారనే నెపంతో పోలీసులను మోహరించింది. దవాఖానను ఆగమేఘాల మీద ప్రారంభించిన ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించకుండానే ప్రజలకు వైద్యం చేస్తుండటంపై ఆరా తీసేందుకు వెళ్లాలని బీఆర్ఎస్ నాయకులు నిర్ణయించారు. రోగులకు సరైన వైద్యం, వసతులు కల్పించడం లేదని పరిశీలనకు వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతారనే భయంతో పోలీసులను ప్రయోగించారు. తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నాయకుల ఇండ్లను పోలీసులు ముట్టడించి నిర్బంధించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసం వద్దకు తెల్లవారుజామున ఉదయం 5 గంటలకే చేరుకుని నిర్బంధించారు. సనత్‌నగర్ బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించారు.
– సిటీ బ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ)

జూబ్లీహిల్స్, అక్టోబర్ 3: ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై మాట్లాడే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు నిర్బంధాలతో అణిచివేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎర్రగడ్డ డివిజన్లో నిర్మితమై ఇటీవల ప్రారంభమైన అతిపెద్ద దవాఖాన టిమ్స్‌లో ఇటీవల భారీ చోరీ జరిగింది. నేడు డాక్టర్లు, మందులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ టిమ్స్ ఆస్పత్రిలో నెలకొన్న అనేక సమస్యలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. దవాఖానలో వసతులు, మందుల కొరత, ఇతర సమస్యల పరిశీలనకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్ తదితరులు టిమ్స్‌ను సందర్శించేందుకు సిద్ధమమ్యారు.
జూబ్లీహిల్స్ పరిధిలోని దవాఖాన కావడంతో నేతలకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివస్తున్నాయన్న సమాచారంతో శనివారం బోరబండ, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ డివిజన్లకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో జూబ్లీహిల్స్, బోరబండ, మధురానగర్ ఠాణాలు బీఆర్ఎస్ నాయకులతో నిండిపోయాయి. టిమ్స్ దవాఖానలో సమస్యలపై ప్రశ్నిస్తారనే భయంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు టిమ్స్‌కు వెళ్లకముందే ముందస్తు అరెస్ట్ చేశారని బోరబండ నాయకులు మండిపడ్డారు. బోరబండ ఠాణాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేశ్‌యాదవ్, బీఆర్ఎస్వీ నాయకుడు సాయికిరణ్ యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు కృష్ణమోహన్, సీనియర్ నేతలు విజయ్‌కుమార్, బొట్టు శివ, ఎర్రగడ్డ డివిజన్ నాయకులు అజీమ్ తదితరులను నిర్బంధించారు. ఈ సందర్భంగా అరెస్టయిన నాయకులు పోలీస్‌స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
యూసుఫ్‌గూడ మాజీ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో యూసుఫ్‌గూడ డివిజన్ మాజీ అధ్యక్షుడు బసవరాజు, సంతోష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు పెరుక రవి, సురేందర్ యాదవ్ తదితరులను అదపులోకి తీసుకున్నారు. మధురానగర్ పీఎస్‌లో యూసుఫ్‌గూడకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నవీన్ పటేల్, నాగరాజు, ఫాహీమ్.. శ్రీనగర్ కాలనీ డివిజన్ నాయకులు జహీర్, ఎర్రగడ్డ డివిజన్ నాయకులు చంద్రశేఖర్‌లను అరెస్ట్ చేశారు. టిమ్స్ దవాఖానలో ఇటీవల జరిగిన భారీ చోరీలో లక్షల విలువైన వైద్య పరికరాలు అపహరణకు గురైన విషయం తెలిసిందే. కాగా దవాఖానలో సమస్యలు తెలుసుకుని వైఫల్యాలపై ప్రశ్నిస్తారన్న భయంతో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మాగంటి సునీత ముఖ్య అనుచరులను ముందస్తుగా అరెస్ట్ చేసి మధురానగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని.. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని సీనియర్ నాయకులు నవీన్ పటేల్ హెచ్చరించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దు

దుండిగల్, అక్టోబర్ 3:బీఆర్ఎస్ నేతలను అక్రమంగా చేసే అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలతో ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా ఆపలేరని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. శనివారం దుండిగల్ సర్కిల్ పరిధిలోని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఇంటివద్ద తెల్లవారుజామునే పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు. ఎమ్మెల్సీ రాజు, మాజీ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై శంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇంట్లో నిర్బంధించడమేమిటని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్దమన్నారు. దీనిని బట్టి బీఆర్ఎస్ చేపట్టే ఆందోళనలకు ప్రభుత్వం బయపడుందని అర్థమవుతుందన్నారు. అక్రమ అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేరని స్ఫష్టం చేశారు. తమను ఎంత అణచాలని చూసినా అంతకు రెట్టింపు స్థాయిలో ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే నిర్బంధాలా?: సునీతా గోపీనాథ్

బంజారాహిల్స్,అక్టోబర్ 3: ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం ఏమిటని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి మాగంటి సునీతాగోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగడ్డలోని టిమ్స్ ఆస్పత్రిలో సమస్యలతోపాటు ఇటీవల చోటు చేసుకున్న చోరీ అంశమై పరిశీలనకు బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేశారు.
మాగంటి సునీతాగోపీనాథ్ ఇంటివద్దకు ఉదయాన్నే పోలీసులు వచ్చి ఆమెను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా సునీతా గోపీనాథ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిమ్స్‌ను రెండేళ్ల తర్వాత ప్రారంభించిన ప్రభుత్వం అక్కడి సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ఆరోపించారు. రెండునెలలు పూర్తయినా ఇప్పటిదాకా రోగులకు సేవలు అందడం లేదన్నారు. దీంతో అక్కడి సమస్యల పరిశీలనకు వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కాగా జూబ్లీహిల్స్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్‌ను ఫిలింనగర్ పోలీసులు గృహ నిర్బంధం చేయగా, బంజారాహిల్స్ డివిజన్ బీఆర్ఎస్ నేత రాజు జేజోలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు రాజు జేజోలకు మద్దతుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంఘీభావం తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికరణ్యాదవ్ శనివారం ఉదయం చేపట్టాల్సిన సనత్‌నగర్ టిమ్స్ సందర్శనతో ఎస్ఆర్నగర్, సనత్‌నగర్ పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. సనత్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలను బాల్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు సురేష్‌గౌడ్, ఖలీల్‌బేగ్, రాజేష్ ముదిరాజ్, భూపాల్‌రెడ్డి, ఆర్.బి.రవికుమార్, మల్లేష్‌యాదవ్ తదితరులను ఉదయం సనత్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
– అమీర్‌పేట్, అక్టోబర్ 3
టిమ్స్‌ను చూసేందుకు వెళ్తే భయమెందుకు?
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతుందని బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ యాదవ్ విమర్శించారు. సనత్‌నగర్ టిమ్స్‌లో ఆపరేషన్ల నిర్వహణ, ఇతర పరికరాల పనితీరును పరిశీలించేందుకు వైద్యుడు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసివెళ్తే అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. దవాఖానకు వెళ్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలంగాణ భవన్‌కు తరలించారు. ఆయన ఇంటికి వెళ్లేందుకు బయల్దేరగా తెలంగాణ భవన్ గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై సాయికిరణ్ అసహనం వ్యక్తంచేశారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనాకాలంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా టిమ్స్‌తోపాటు వరంగల్ సూపర్‌స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి అంకురార్పణ చేశారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై కక్షతో పూర్తిచేసేందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. పూర్తిస్థాయిలో వసతులు కల్పించకుండా, వైద్యసిబ్బంది పోస్టులు భర్తీ చేయకుండా అగమేఘాలపై సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభించిందని విమర్శించారు. ఇటీవలే ఆపరేషన్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో పరిశీలనకు వెళ్తున్న తమను పోలీసులతో అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు.