వరంగల్‌చౌరస్తా, డిసెంబర్ 20 : హౌసింగ్ బోర్డు నిబంధనలు పట్టించుకోకుండా, అయినవారి కోసం అనుచరుడికి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. శనివారం వరంగల్ రాంకీ ఎన్క్లేవ్ సందర్శన సందర్భంగా చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లోని ఫ్లాట్లను లక్కీడ్రా ద్వారా కేటాయింపులకు నిర్ణయించిన విష యం తెలిసిందే. ఈ మేరకు వరంగల్ రాంకీ ఎన్‌క్లేవ్‌లో ఉన్న 102 ఫ్ల్లాట్ల వేలానికి జనవరి 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి, 8వ తేదీన కేటాయింపులు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని గృహనిర్మాణ సముదాయాన్ని శనివారం అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సుమతో పరిశీలనకు వెళ్లిన మంత్రి సురే ఖ లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు.
మీ ఇష్టం ప్రకారమే
ఫ్లాట్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి సురేఖకు రాంకీవాసులు సమస్యలు మొరపెట్టుకున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన తమవిల్లాల పక్కన పేదలకు ఫ్లాట్లు కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఈ లేబర్ వేషాలతో మాకెందుకు’ అంటూ సమస్యను పరిష్కరించాలని మం త్రిని కోరగా స్పందించిన సురేఖ రాంకీ ఎన్క్లేవ్స్వాసులకు ‘అంతా మీ ఇష్టప్రకారమే చే స్తాం’ అని మాటివ్వడంతో అధికారులతో పాటు ఔత్సాహికులు షాక్‌కు గురయ్యారు.
ఉమ్మడి ఏపీలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని, తెలంగాణ హౌసింగ్ బోర్డు నిబంధనలను అతిక్రమించి రాంఖీ విల్లాలకు హౌసింగ్ బోర్డు ఫ్లాట్లకు మధ్య ఎత్తుగా గోడ నిర్మాణం చేసి, రైల్వేస్టేషన్ వైపు ప్రహరీని కూల్చి దారి ఏర్పాటు చేయాలని ముఖ్య అనుచరుడి (గోపాల నవీన్‌రాజ్)కి ఆదేశాలు ఇవ్వడంతో అంతా మౌనం వహించారు. పేదల పక్షాన ఉండాల్సిన మంత్రి నిబంధనలు తుంగలో తొక్కి సంపన్నుల మెప్పు కోసం అనుచరుడి పెత్తనాన్ని ఇవ్వడంపై కొందరు ఫ్లాట్ల కొనుగోలు ఔత్సాహికులను నిరాశకు గురిచేసింది.