హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి నేటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో అమరుడుగా నిలిచాడని సీపీఐ నేతలు కొనియాడారు. రావి నారాయణరెడ్డి 118వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ భవన్ ఆర్ఎన్ఆర్ ఆడిటోరియంలో నారాయణరెడ్డి విగ్రహానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి డా కే నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఈటీ నరసింహ, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, కోశాధికారి ఉజ్జిని రత్నాకర్ రావు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర గేయంలో తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఒక్క జ్ఞాపిక లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను సెప్టెంబర్ 11 నుంచి 17వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నారాయణ కోరారు. రావి నారాయణరెడ్డి సేవలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు.