ఖమ్మం, ఫిబ్రవరి 10: ట్రోలింగ్ అనేది సమాజానికి ప్రమాదకరంగా మారిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాలులో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ ఏడో మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత అధ్యక్షతన జరిగిన సదస్సులో బీబీసీ తెలుగు ఎడిటర్ రామ్మోహన్రావు, ప్రముఖ రచయిత్రి ఓల్గా ఉపన్యసించారు.
సోషల్ మీడియా వేదికగా మహిళలపై ట్రోలింగ్ విపరీతంగా జరుగుతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అనేక పెట్టుబడిదారీ వ్యవస్థలు ఈ ట్రోలింగ్‌ను తమ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు ఉపయోగించుకుంటున్నాయని ధ్వజమెత్తారు. పాలకులు సైతం విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. అనంతరం పలువురు వక్తలు వివిధ అంశాలపై ఉపన్యసించారు. ఆ తరువాత ‘ట్రోల్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహాసభల సమన్వయకర్త రవిమారుత్, పలువురు ప్రముఖ రచయితలు తదితరులు పాల్గొన్నారు.