హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): దేశీ ఆవు పాల ఆహార పదార్థాలపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనం చేయనున్నది. ఆ పాల నుంచి తయారుచేసిన పెరుగు, వెన్న, నెయ్యి ఇతర పాల పదార్థాల్లోని పోషకాలు, వాటి ఉపయోగాలను శాస్త్రీయంగా పరిశోధించనున్నది. ఇందుకు పటాన్చెరు సమీపంలోని దేశీ ఆవులను మాత్రమే పెంచుతున్న ఇక్రిశాట్ విజిటింగ్ సైంటిస్ట్, ప్రముఖ వెటర్నరీ సైంటిస్ట్ సాయిబుచ్చారావు డెయిరీ ఫామ్ సంస్థతో ఎన్ఐఎన్ ఒప్పందం చేసుకున్నది. ఆవు పాల ఆహార పదార్థాల అధ్యయనానికి కేంద్ర పశుసంవర్థకశాఖ ఇచ్చే అనుమతుల ప్రక్రియకు నెల రోజులు పట్టనున్నది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆవు పాలతో ప్రాణాంతక వ్యాధులకు కూడా చక్కని పరిష్కారం దొరుకుతుందా? అనే అంశాన్ని తేల్చేందుకు ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్టు అనంతన్ నేతృత్వంలో అధ్యయనం చేయనున్నది.