పట్టీలు, చెవిదుద్దులు, మంగళసూత్రాలు, చేతి కంకణాలు సహా అన్నింటినీ ఒలిపించి, సవాలక్ష తనిఖీలు చేసి విద్యార్థులను పరీక్షకేంద్రాల్లోకి అనుమతించినా.. ఎక్కడో చోట నీట్ నిర్వహణ లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆదివారం జరిగిన రీఎగ్జామ్‌కు రెండు దశల తనిఖీలను దాటుకుని విద్యార్థి లోనికి ఫోన్ పట్టుకెళ్లాడు. వాష్‌రూమ్‌లో దాచిపెట్టి, పరీక్ష మధ్యలో వెతుక్కుంటూ దొరికిపోయాడు.
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ),ఆదిబట్ల/ తుర్కయాంజాల్: వివాదాలమయంగా మారిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) యూజీ రీ ఎగ్జామ్ నిర్వహణలో మరోసారి లోపాలు బయటపడ్డాయి. తీవ్ర విమర్శల నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఎన్టీయే చెప్తున్నా.. వైఫల్యాలు మళ్లీ వెలుగుచూశాయి. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థి ఏకంగా ఫోన్‌ను ఎగ్జామ్ సెంటర్ ప్రాంగణలోకి తీసుకురావడం సంచలనానికి దారితీసింది. ప్రశ్నపత్రాల లీకేజీ.. అనేక అవకతవకలు.. సెంటర్ల కేటాయింపులో అక్రమాలు వంటి ఆరోపణలతో ఆదివారం నిర్వహించిన రీ ఎగ్జామ్‌కు హాజరైన విద్యార్థి ఫోన్ తీసుకెళ్లడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(సెంటర్ నంబర్ 42082 09) నీట్ పరీక్ష నిర్వహించారు.
అచ్చంపేటకు చెందిన 18 ఏండ్ల అభ్యర్థి ఉదయం 7 గంటలకు పాఠశాలకు వచ్చి ప్రహరీకి ఆనుకొని ఉ న్న బాత్రూమ్ వెంటిలేటర్లో ఫోన్ దాచాడు. ఉదయం 11 గంటలకు బాత్రూమ్లోకి ప్రవేశించి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్లష్ట్యాంక్లో దాచాడు. యథావిధిగా పరీక్ష హాజరైన అభ్యర్థి పరీక్ష సమయంలో కడుపునొప్పి అని చెప్పి బా త్రూమ్కు వెళ్లాడు. పాఠశాలకు దూరంగా ఉన్న బాత్రూమ్ వద్దకు అభ్యర్థి పలుమార్లు వెళ్త్తూ.. ఎక్కువసేపు (సుమారు గంటన్నర) అక్కడే ఉండటంతో గమనించిన ఇన్విజిలేటర్ అటెండర్‌ను పంపించాడు.
తనిఖీ చేయగా విద్యార్థి ఫోన్లో సమాధానాలు వెతుకుతూ కనిపించా డు. సిబ్బంది ఫోన్‌ను తనిఖీ చేయగా సమాధానాల కోసం గూగుల్‌క్రోమ్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగించినట్టు గుర్తించారు. విద్యార్థి పరీక్ష రాసిన అనంతరం పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ విషయంలో అనేక లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పోలీసులు పాఠశాల ప్రాంగణాన్ని రెండుసార్లు (ఉదయం 6, 11 గంటలకు) పూర్తిగా తనిఖీ చేసినప్పటికీ ఫ్లష్‌ట్యాంకులో దాచిపెట్టిన ఫోన్‌ను మాత్రం కనిపెట్టలేకపోయారు.

విద్యార్థి మొబైల్‌ను సెంటర్లోకి తీసుకొచ్చిన విషయం వాస్తవమేనని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. ఇదే విషయంపై ఆయన్ను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో విద్యార్థి కడుపునొప్పి వస్తుందని చెబితే అనుమతించామని తెలిపారు. అనుమానం వచ్చి తనిఖీ చేస్తే మొబైల్ దొరికిందని, గూగుల్ క్రోమ్‌లో ఏదో సెర్చ్ చేసినట్టు గుర్తించామని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలను బయటికి పంపించినట్టు తమ పరిశీలనలో తేలలేదని తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాలను అనుసరించి సదరు విద్యార్థిని ఓ గదిలో కూర్చోబెట్టి పరీక్ష రాయించామని పేర్కొన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత కేసు నమోదుచేశామని, ఇదే విషయంపై ఎన్టీఏను సంప్రదించామని. జరిగిన విషయాన్నంతా అధికారులకు చేరవేశామని తెలిపారు.
నీట్ (యూజీ) రీ ఎగ్జామ్ సజావుగా ముగిసింది. విద్యార్థులకు 15 నిమిషాల అదనపు సమయం ఇచ్చారు. గతంలో 3గంటలపాటు పరీక్ష నిర్వహించగా, ఆదివారం 3:15గంటలపాటు పరీక్ష నిర్వహించారు. దీంతో విద్యార్థులకు అదనపు సమయం కలిసొచ్చింది. అయితే ఫిజిక్స్ ప్రశ్నలు విద్యార్థులకు చుక్కలు చూపించాయి. మేలో నిర్వహించిన పరీక్షతో పోల్చితే ఈ సారి కఠినంగా ప్రశ్నలిచ్చారు. ప్రశ్నపత్రం నిడివి పెద్దగా ఉండటంతో ఇబ్బందులు తప్పలేదు. ప్రశ్నలు ఛేదించేందుకు విద్యార్థులు చెమటోడ్చారు. ఈ విభాగంలో సగటు విద్యార్థి 2-25 ప్రశ్నలు సులభంగా రాయవచ్చని శ్రీచైతన్య విద్యాసంస్థల నీట్ శిక్షకుడు శంకర్రావు.
ఫిజిక్సే కాకుండా కెమిస్ట్రీ కూడా విద్యార్థులను కలవరపెట్టింది. కెమిస్ట్రీ ప్రశ్నలు కూడా పొడవుగా, కఠినంగా ఇచ్చారు. 2025తో పోల్చితే కెమిస్ట్రీ అత్యంత కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు వాపోయారు. ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. ప్రాథమిక అంచనా ప్రకారం కటాఫ్ 40-50 మార్కులు తగ్గే అవకాశమున్నది. జనరల్ క్యా టగిరీలో 420 మార్కులుండే అవకాశమున్న ట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వుడ్ క్యాటగిరీలో 370-400 మార్కుల వరకు ఉంటుందని శంకర్రావు అంచనావేశారు.
నీట్ పరీక్షకు విద్యార్థుల హాజరు భారీగా తగ్గింది. మే పరీక్షతో పోల్చితే 8.5% విద్యార్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో 208 సెంటర్లల్లో పరీక్ష నిర్వహించారు. రాష్ట్రం నుంచి 73,059 మంది దరఖాస్తు చేసుకోగా 65,087మంది (89.09%) పరీక్షకు హాజరు కాగా 7,972 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. మేలో నిర్వహించిన పరీక్షకు 97.64% హాజరు కాగా ఈ సారి 89% అంటే 8.5% విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రానికి గొల్లపల్లి మండలం రాపల్లికి చెందిన మారంపల్లి నందిని 5 నిమిషాలు ఆలస్యంగా వ చ్చింది. అప్పటికే టైమ్ అయిపోవడంతో లోపలికి వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది పర్మిషన్ ఇవ్వలేదు. కళాశాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ఆలస్యంగా వచ్చామని, లోపలికి వెళ్లనివ్వాలని తల్లి దేవికతో కలిసి నందిని ఎంత బతిమిలాడినా.. సిబ్బంది కాళ్లు పట్టుకున్నా అనుమతించలేదు. చేసేదేం లేక కొద్దిసేపు ఎదురుచూసి వెనుదిరిగారు. నిజామాబాద్ జీజీ కాలేజీ వద్ద నలుగురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. మరొకరు బోధన్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉండ గా నిజామాబాద్‌కు వచ్చి పరీక్షకు హాజరు కాలేకపోయారు.