నందికొండ, ఆగస్టు 28 : నాగార్జునసాగర్ డ్యాంలో నిల్వ ఉన్న కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రకు కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ఆంధ్ర అధికారులు కుడి కాలువకు ఈ నెల 26న తాగునీటి విడుదల ప్రారంభించిన విషయం విదితమే. కుడికాలువకు 500 క్యూసెక్కులతో నీటి విడుదల ప్రారంభించి 6,660 క్యూసెక్కులతో నీటి విడుదల కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఎడమ కాలువకు రెండు వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తుండటంపై ప్రజలు, రైతుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు శుక్రవారం నుంచి నీటి విడుదలను 5,582 క్యూసెక్కులకు పెంచారు.
నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి తాగు నీటి కోసం రోజుకు 14,242 క్యూసెక్కుల ( 1.23 టీఎంసీలు) అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. నాగార్జునసాగర్ డ్యామ్ ఎడమ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కులతో అడవి దేవులపల్లి రిజర్వాయర్ నింపడానికి నీటి విడుదల ప్రారంభించామని, ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నింపడానికి ఎడమ కాలువకు నీటి విడుదలను 5,582 క్యూసెక్కుల మేర పెంచినట్టు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి ప్రస్తుతం ఎడమ కాలువ ఆయకట్టుకు సాగుకు నీరందించే స్థితిలో ప్రభుత్వం లేకున్నా, రానున్న రోజుల్లో సాగర్ డ్యామ్ పరిధిలోని ప్రజలకు తాగు నీటి కష్టాలను తెచ్చేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. శ్రీశైలం నుంచి జలవిద్యుత్తు కేంద్రాల ద్వారా 18,990 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరుతున్నది. ఇన్‌ఫ్లోను ఆదే స్థాయిలో కాలువ ద్వారా నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి బయటకు విడుదల చేస్తన్నారు. ప్రతి రోజూ 1.23 టీఎంసీల నీరు నాగార్జుసాగర్ డ్యామ్ నుంచి విడుదలవుతే ఎండాకాలంలో డ్యామ్ పరిధిలోని జనం తాగు నీటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.