Harithaharam | చండ్రుగొండ, జూన్ 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల గంటల వీరయ్య కుంటను జెసిబి సహాయంతో ఆక్రమించేందుకు రాష్ట్ర మంత్రి సమీప బంధువు ప్రయత్నించాడు. అందులో భాగంగా బుధవారం చెరువు కట్టపై ఉన్న హరితహారం చెట్లను జెసిబితో తవ్వి రంపాలతో ముక్కలు ముక్కలుగా కత్తిరించి పక్కకు పడేశాడు. చెరువు కట్టను తన పక్క పొలంలో కలిసేలా తవ్వకం పనులు చేపట్టాడు. గ్రామస్తులు అటుగా రావడంతో జెసిబిని తీసుకొని మరో పక్కన ఉన్న పెద్దపెద్ద చెట్లను తవ్వించేశాడు.
ఈ ఆక్రమణ పట్టపగలు జరుగుతున్న మండల అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవటం పట్ల పలు అనుమానాలు గ్రామస్తుల్లో వ్యక్తం అవుతున్నాయి. మంత్రి బంధువు కావడం వల్ల హరితహారం చెట్లను నరకటం, అనుమతులు లేకుండా ఇతర చెట్లను సైతం నిబంధనకు విరుద్ధంగా నరికి వేయటం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా చెరువు కట్టను తవ్వడంపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.