హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల మెరిట్ జాబితా త్వరలో విడుదల కానున్నది. ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ముమ్మర కసరత్తు చేస్తున్నది. మొత్తం మీద 1ః2 నిష్పత్తిలో అభ్యర్థులను డెమోకు పిలువాలని యోచిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో మొత్తం తొమ్మిది క్యాటగిరీల్లో పీజీటీ 1,276, టీజీటీ 4,020, జేఎల్, డీఎల్, ఫిజికల్ డైరెక్టర్ 2,876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టుల భర్తీకి ఇటీవలనే సబ్జెక్టుల వారీగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా ఉద్యోగాల మెరిట్ జాబితాలను రూపొందించే పనిలో ట్రిబ్ నిమగ్నమైంది. పైనుంచి అంటే డిగ్రీ లెక్చరర్, తరువాత జేఎల్, ఆపై పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేయాలని సన్నాహాలు చేస్తున్నది. అభ్యర్థులు అర్హతలను బట్టి రెండుకన్న ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో పైస్థాయి నుంచి పోస్టులను భర్తీ చేయడం వల్ల మళ్లీ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉండబోదని భావిస్తున్నది. ఈ దిశగా పోస్టుల భర్తీ ప్రక్రియకు ట్రిబ్ చర్యలు చేపట్టింది. టీఎస్పీఎస్సీ జేఎల్ పరీక్షలు ముగిశాక డీఎల్ మెరిట్జాబితా విడుదల చేసి, 1ః2 నిష్పత్తిలో అభ్యర్థులను డెమోకు పిలువాలని ట్రిబ్ సన్నాహాలు చేస్తున్నది.
ఆప్షన్ల స్వీకరణ
ఇదిలాఉండగా, ప్రభుత్వ గురుకులాలకు సంబంధించి జోనల్ స్థాయి పోస్టులైన టీజీటీ, స్కూల్ పీడీ, లైబ్రేరియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టుల రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియను ట్రిబ్ ప్రారంభించింది. ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల మెరిట్ జాబితాలను కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది. టీజీటీ అభ్యర్థులు ఈ నెల 30 లోపు , స్కూల్ లైబ్రేరియన్, పీడీ, డ్రాయింగ్ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుల అభ్యర్థులు అక్టోబర్ 3 నుంచి 9లోపు జోన్వారీగా, గురుకుల సొసైటీల వారీగా ఆప్షన్లు ఇవ్వాలని ట్రిబ్ అధికారులు సూచించారు.