హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగురోడ్డుపై వాహనాల వేగ పరిమితిని పెంచుతున్నట్టు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల పొడవునా.. 19 ఇంటర్‌చేంజ్‌లతో ఉన్న ఔటర్‌పై ప్రస్తుతం గంటకు గరిష్ఠ వేగ పరిమితి 100 కిలోమీటర్లు ఉన్నదని, దాన్ని గంటకు 120 కిలోమీటర్లకు పెంచినట్టు ప్రకటించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు.
భధ్రతాపరంగా అన్ని ఏర్పాట్లను పరిశీలించిన తర్వాతే వాహనాల వేగం గరిష్ఠ పరిమితిని పెంచినట్టు చెప్పారు. 158 కిలోమీటర్ల పొడవు నా రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలిగేలా ఏర్పా ట్లు చేసినట్టు తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ రాకపోకలు సాగించాలని సూచించారు. ఓఆర్ఆర్పై అడ్డంకులు లేకుండా పెట్రోలింగ్ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయని పేర్కొన్నారు.